సమస్యలపై జనసేన సమరభేరి... జనవాణి అర్జీల పరిశీలన ప్రక్రియను సమీక్షించిన నాదెండ్ల

  • నిన్న విజయవాడలో రెండో విడత జనవాణి
  • భారీగా తరలివచ్చిన ప్రజలు
  • పవన్ కల్యాణ్ కు అర్జీల అందజేత
  • అర్జీలను పరిశీలించనున్న జనసేన పార్టీ ప్రత్యేక బృందం
Nadendla supervise Janavani complaints scrutiny

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయవాడలో నిన్న రెండో విడత జనవాణి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ప్రజలు వినతిపత్రాలతో భారీగా తరలివచ్చారు. కాగా, జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో ఇప్పటివరకు రెండు విడతల్లో అందిన అర్జీలను పరిశీలించే కార్యక్రమాన్ని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు షురూ చేశారు. 

ఈ అర్జీలను పరిశీలించి, వాటిలోని సమస్యల ఆధారంగా సంబంధిత ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయనున్నారు. ఈ ప్రక్రియను నాదెండ్ల నేడు సమీక్షించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జనసేన నేత డి.వరప్రసాద్ నేతృత్వంలో ఈ అర్జీలను శాఖల వారీగా విభజించి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు అర్జీదారుల సమస్యలు తెలియజేస్తారు. 

దీనికోసం జనసేన పార్టీ అధినాయకత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ప్రతి అర్జీని ఈ బృందం పరిశీలించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రతి సమస్యను సమీక్షించి, స్వయంగా సంబంధిత శాఖలకు లేఖలు రాస్తారు.

More Telugu News