Uttar Pradesh: నుపుర్ శర్మ వివాదం.. షాపుల్లో తుపాకులు పెట్టుకోవాలన్న బీజేపీ ఎమ్మెల్యే

  • రెండు పెట్టెల్లో రాళ్లు, నాలుగైదు గడ్డపారలు కూడా పెట్టుకోవాలన్న ఎమ్మెల్యే
  • పోలీసులు మాత్రం ఎంతకాలమని పనిచేస్తారన్న విక్రం సైనీ
  • ఐదేళ్లపాటు తనను ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్య
BJP MLA stirs controversy in speech over Nupur Sharma row

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలీ బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము రక్షించుకునేందుకు నగరంలోని వ్యాపారులకు అవసరమైన చిట్కాలు చెబుతూ.. దుకాణాల్లో రాళ్లు, గడ్డపారలు, తుపాకులు పెట్టుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎన్ని రోజులని కాపాడతారని, వారొచ్చే సరికే మీ షాపులు తగలబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్, ఎమ్మెల్యే విక్రమ్ సైనీలకు జన్సత్ తహసీల్ ప్రాంతంలోని వాజిద్‌పూర్ కావాలి గ్రామంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి దీనిని తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 

ఆ వీడియోలో విక్రం సైనీ మాట్లాడుతూ.. ‘‘రెండు పెట్టెల్లో రాళ్లు పెట్టుకోండి. నాలుగైదు గడ్డపారలు కూడా ఉంచుకోండి. అలాగే, రెండు తుపాకులు కూడా పెట్టుకోండి. పోలీసులు మాత్రం ఎంతకాలమని పనిచేస్తారు. పోలీసులు వచ్చే సరికి మీ దుకాణాలను తగలబెట్టేస్తున్నారు’’ అని ఆయన అన్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొందరు నేతలు ఆయనను నిలువరించేందుకు ప్రయత్నించారు.

అప్పుడాయన బదులిస్తూ.. ‘‘నన్ను మాట్లాడనివ్వండి. ఇది న్యూస్‌పేపర్లలో రాసుకోమనండి. టీవీల్లో చూపించుకోమనండి. ఐదేళ్ల వరకు ఎవరూ నన్నేమీ చేయలేరు. నాకు ఇంతకుమించిన కోరిక కూడా లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయ్‌పూర్ ఘటన గురించి మాట్లాడుతూ.. నుపుర్ శర్మ మాట్లాడడం ఆమె ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ‘‘హిందూ దేవతలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చా?.. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం తల నరికేస్తారా?’’ అని విక్రం సైనీ ప్రశ్నించారు.

More Telugu News