Bhuvneshwar Kumar: నా కెరియర్ ముగిసిపోయిందని అనుకోలేదు: భువనేశ్వర్

Bhuvneshwar Kumar Never thought my India career was over
  • ఫిజియోలు, ట్రైనర్లతో కష్టపడి పనిచేశానని వెల్లడి
  • జట్టుకు దూరమైతే నిరాశకు గురికావడం సహజమన్న అభిప్రాయం
  • నమ్మకాన్ని కోల్పోతామన్న టీమిండియా బౌలర్

భారత బౌలర్ భువనేశ్వర్ వరుసగా తన అసాధారణ ప్రతిభతో అభిమానులను అకట్టుకోవడమే కాకుండా, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ తో రెండో టీ20లోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు. మూడూ ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కానీ, భువనేశ్వర్ కుమార్ తన కెరీర్ లో గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నో సార్లు గాయాలపాలై ఫిట్ నెస్ పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

అయినా కానీ అతడు తన ప్రతిభకు మరింత సాన బెట్టినట్టు ఫలితాలు తెలియజేస్తాయి. దీనిపై మీడియా ప్రతినిధుల నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. గాయాలపాలై జట్టుకు దూరమైన సందర్భంలో కెరీర్ ముగిసిపోయినట్టేనా? అన్న సందేహం వచ్చిందా అంటూ ప్రశ్నించారు. దీనికి అతడు స్పందిస్తూ.. ‘‘నేను ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఫిజియోలు, శిక్షకులతో కలసి నా వంతు కృషి చేశాను. అయితే, ఆటకు దూరమైనప్పుడు నమ్మకం కోల్పోతాం. కొంత నిరాశ, అసంతృప్తికి లోనవుతాం. కానీ, అదృష్టవశాత్తూ నేను జట్టులోకి తిరిగొచ్చి ఆడతానని తెలుసు’’అని చెప్పాడు.
 
బాల్ ను స్వింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించడం భువనేశ్వర్  నైపుణ్యం. దీనిపై మాట్లాడుతూ బాల్ స్వింగ్ చేస్తుంటే నిజంగా ఆనందించొచ్చన్నాడు. ఇది ఫాస్ట్ బౌలర్ కు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పాడు. అప్పుడు బ్యాట్స్ మెన్  చాన్స్ తీసుకుంటారని చెప్పాడు. బట్లర్ వికెట్ ను భువనేశ్వర్ అలానే పడగొట్టడం ఆసక్తికరం.

  • Loading...

More Telugu News