శ్రీలంకలో సంక్షోభ పరిష్కారానికి రంగంలోకి దిగిన ఆర్మీ..
- శాంతియుత మార్గంలో పరిష్కారానికి అవకాశం ఉందంటూ ప్రకటన
- ప్రజలు సాయుధ దళాలకు, పోలీసులకు సహకారించాలని సూచన
- రక్షణ దళాల చీఫ్ నుంచి ప్రకటన విడుదల
ప్రధాని రణిల్ విక్రమ సింఘే ప్రైవేటు వాహనానికి సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో రక్షణ దళాల చీఫ్ జనరల్ శవేంద్ర శిల్ప ప్రకటన చేశారు. శాంతియుత మార్గంలో సంక్షోభ పరిష్కారానికి అవకాశం లభించినట్టు చెప్పారు. దేశంలో శాంతి స్థాపనకు వీలుగా సాయుధ దళాలు, పోలీసులకు సహకారం అందించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
మూడు నెలలకు పైగా శ్రీలంకలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. తీసుకున్న విదేశీ రుణాలు చెల్లించలేక శ్రీలంక చేతులు ఎత్తేసింది. దీంతో కొత్తగా విదేశీ రుణాలు పుట్టడం ఆ దేశానికి అసాధ్యంగా మారిపోయింది. పెట్రోల్, ఆహారోత్పత్తుల దిగుమతులకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలోకి జారిపోయింది. దీంతో ప్రజలు అసహనంతో రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐఎంఎఫ్ నుంచి అప్పు తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో జాప్యం నెలకొంది.