T20 Blast 2022: టీ20 బ్లాస్ట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్.. రిమోట్ కంట్రోల్ కారులో వచ్చిన బంతి: వీడియో ఇదిగో

  • అంపైర్ తీసుకురావాల్సిన మ్యాచ్ బాల్‌ను మోసుకొచ్చిన కారు
  • ఆశ్చర్యపోయిన క్రికెటర్లు, ప్రేక్షకులు
  • సర్రే-యార్క్‌షైర్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కనిపించిన దృశ్యం
Match Ball Arrives In Remote Controlled Car In T20 Blast 2022

క్రికెట్‌లో ఆవిష్కరణలు కొత్తకాదు. బ్యాటర్లు అసంబద్ధమైన షాట్లు ఆడుతుంటే, బౌలర్లు వైవిధ్యంగా బంతులేస్తున్నారు. అలాగే, నిర్వాహకులు కూడా కొత్త కొత్త నియమనిబంధనలు తీసుకొస్తున్నారు. ఇలా కొత్తగా పుట్టే ఒక్కో ఐడియా ఆటను మరింత రంజుగా మారుస్తోంది. ప్రేక్షకులను ఆలరిస్తోంది. 

ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఇలాంటి కొత్త ఆవిష్కరణ ఒకటి కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా మ్యాచ్‌బాల్‌ను అంపైర్ మైదానంలోకి తీసుకొస్తాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం అంపైర్ చేయాల్సిన పనిని ఓ రిమోట్ కంట్రోల్ కారు చేసింది. కొత్త బంతిని మైదానంలోకి మోసుకొచ్చింది. గ్రౌండ్‌లోకి దూసుకొస్తున్న కారును చూసిన ప్రేక్షకులు, క్రికెటర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 

సర్రే-యార్క్‌షైర్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఓ రిమోట్ కంట్రోల్ కారు బౌండరీ లైన్ నుంచి దూసుకొచ్చి మైదానం మధ్యలోకి వచ్చి ఆగింది. దానిపైన బంతి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను మ్యాచ్ నిర్వాహకులు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది.

ఇక, చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, అనంతరం 161 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సర్రే 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

More Telugu News