Shooter: షింజో అబే తీరుతో తీవ్ర అసంతృప్తి చెందా... అందుకే చంపాలనుకున్నా: పోలీసులకు వెల్లడించిన నిందితుడు

  • నరా నగరంలో కాల్పులు
  • మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత
  • నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 2005 వరకు సైన్యంలో పనిచేసిన నిందితుడు
Police detained Shinzo Abe shooter

జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నరా నగరంలో ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో మాజీ ప్రధాని షింజో అబే మరణించడం తెలిసిందే. ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతుండగా, దేశవాళీ తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన షింజో అబేను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. 

కాగా, షింజో అబేపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని యమగామి టెట్సుయా అనే మాజీ సైనికుడిగా గుర్తించారు. అతడి వయసు 41 ఏళ్లు. గతంలో అతడు జపాన్ నేవీ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేశాడు. 2005లో సైన్యం నుంచి వైదొలిగాడు. 

కాల్పులు జరిపిన వెంటనే అతడిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. షింజో అబే తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యానని, అందుకే చంపాలని నిశ్చయించుకున్నానని ఆ వ్యక్తి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. టీషర్టు, బ్యాగీ ట్రౌజర్ ధరించిన ఆ వ్యక్తి షింజో అబేకు అత్యంత సమీపానికి వచ్చి కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ఒకటి మెడలోకి, మరొకటి కాస్త కిందుగా ఎడమవైపు ఛాతీకి సమీపంలో దూసుకెళ్లినట్టు వెల్లడైంది.

More Telugu News