'ఆహా'లో 'సమ్మతమే' .. స్ట్రీమింగ్ డేట్ ఖరారు!

07-07-2022 Thu 18:15
  • వరుస సినిమాలతో బిజీగా అబ్బవరం
  • ఇటీవల కాలంలో దక్కని హిట్ 
  • నిరాశ పరిచిన 'సమ్మతమే' ఫలితం 
  • ఈ నెల 15న 'ఆహా'లో వస్తున్న సినిమా
Sammathame movie update
కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన కిరణ్, ఒకేసారి అరడజను ప్రాజెక్టులను లైన్లో  పెట్టేయడం అంత తేలికైన విషయమేం కాదు. అయితే ఇటీవల వచ్చిన 'సెబాస్టియన్' ఎంత మాత్రం ఆడలేదు. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'సమ్మతమే' వచ్చింది.  

కిరణ్ జోడీగా చాందినీ చౌదరి నటించిన ఈ సినిమాపై ఆసక్తి ఉండేది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోవడం ఖాయమని కిరణ్ చాలా బలంగా చెప్పాడు. కానీ విడుదల తరువాత ఈ సినిమాను గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. నిదానంగా పుంజుకుంటుందనే నమ్మకాన్ని కిరణ్ వ్యక్తం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 

యూజీ క్రియేషన్స్ బ్యానర్ పై గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఓటీటీ నుంచి ఈ సినిమా ఎలాంటి  రిజల్టును రాబడుతుందో చూడాలి.