టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ మృతి

07-07-2022 Thu 12:34
  • ఈ ఉదయం మృతి చెందిన గోరంట్ల రాజేంద్ర ప్రసాద్
  • అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచిన రాజేంద్ర ప్రసాద్
  • ఆయన వయసు 86 సంవత్సరాలు
Tollywood producer Gorantla Rajendra Prasad passes away
సినీ ప్రముఖుల వరుస మరణాలు టాలీవుడ్ ను విషాదంలో ముంచేస్తున్నాయి. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణించి రెండు రోజులు కూడా గడవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన మరణంతో టాలీవుడ్ ప్రముఖులు షాక్ కు గురయ్యారు.

మూవీ మొఘల్, దివంగత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత 'మాధవి పిక్చర్స్' సంస్థను స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు. కురుక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర చిత్రాలు ఆయన నిర్మించినవే. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.