'భలే భలే మగాడివోయ్'కి సీక్వెల్ చేస్తాను: మారుతి

07-07-2022 Thu 10:39
  • 2015లో వచ్చిన 'భలే భలే మగాడివోయ్'
  • నాని సరసన నటించిన లావణ్య త్రిపాఠి 
  • మారుతి కెరియర్లో చెప్పుకోదగిన సినిమా 
  • యాక్షన్ టచ్ తో సీక్వెల్ కి సన్నాహాలు
Bhale Bhale Magadivoy Movie Sequel
తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ ను సెట్ చేసుకుని .. మంచి అవుట్ పుట్ ను ఇచ్చే దర్శకులలో మారుతి ఒకరు. ఆయన నుంచి వచ్చిన చెప్పుకోదగిన సినిమాలలో 'భలే భలే మగాడివోయ్' ఒకటి. నాని - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమాను యూవీ - గీతా ఆర్ట్స్ 2 సంస్థలు కలిసి నిర్మించాయి. 2015లో వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది.

తాజా ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ .. 'భలే భలే మగాడివోయ్' సినిమా తర్వాత సీక్వెల్ చేయమని చాలామంది చెప్పారు. సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అప్పుడు ఆ విషయంపై నేను అంతగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నాను. 

 అయితే కథ ఆ సినిమాకి కొనసాగింపుగా కాకుండా, కామెడీతో కూడిన యాక్షన్ జోనర్లో నడిపిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడానికి ఇంకా సమయం ఉంది. ఈ లోగా నేను చేయవలసిన సినిమాలు పూర్తి చేస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద సీక్వెల్ ఉందనేది ఖాయమై పోయిందన్నమాట.