యూకేలో ధోనీ పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం

07-07-2022 Thu 10:03
  • అర్ధరాత్రి కేక్ కట్ చేసిన ధోనీ
  • భార్య, కుమార్తె, స్నేహితులు హాజరు
  • వేడుకలో పాల్గొన్న రిషబ్ పంత్
  • శుభాకాంక్షలతో క్రికెటర్ల ట్వీట్లు
MS Dhoni celebrates his birthday with wife Sakshi in UK
భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన 41వ పుట్టిన రోజు వేడుకల కోసం బ్రిటన్ లో వాలిపోయారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆయన గురువారం తన పుట్టిన రోజు సంబరాలు చేసుకుంటున్నారు. భార్య సాక్షి, కుమార్తె జీవ, స్నేహితుల సమక్షంలో ఆయన ఓ పెద్ద కేక్ కట్ చేశారు.

ధోనీ కేక్ కటింగ్ వీడియోను ఆయన జీవిత భాగస్వామి సాక్షి సింగ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 5.90 లక్షలకు పైగా దీన్ని లైక్ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ధోనీ కేక్ కట్ చేశారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సైతం ధోనీ పుట్టిన రోజు సంబరాలకు హాజరయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో పంత్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. 

మరోపక్క, ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలతో ట్వీట్లు వెల్లువెత్తాయి. ధోనీ పూర్వ సహచరులు, ప్రస్తుత ఆటగాళ్లు శుభాకాంక్షలతో ట్వీట్ చేశారు. (ఇన్ స్టా వీడియో కోసం)