రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి రాజీనామా

07-07-2022 Thu 08:01
  • రాజ్యాంగం సాధారణ ప్రజలను దోచుకునేలా ఉందని చెరియన్ వ్యాఖ్యలు
  • వివాదాస్పదం కావడంతో తీవ్రంగా స్పందించిన సీపీఎం అగ్రనాయకత్వం
  • శాసన సభ్యత్వాన్ని మాత్రం వదులుకోని చెరియన్
Kerala minister Saji Cherian resigns
మన రాజ్యాంగం సాధారణ ప్రజలను దోచుకునేలా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మత్స్యశాఖ మంత్రి సాజి చెరియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో  సీపీఎం అగ్రనాయకత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్‌ను కలిసిన చెరియన్ అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేసిన ఆయన శాసనసభ్యత్వాన్ని మాత్రం వదులుకోలేదు. నిజానికి ఆయనను కాపాడేందుకు రాష్ట్ర నాయకత్వం చివరి క్షణం వరకు ప్రయత్నించినప్పటికీ అగ్రనాయకత్వం ఆదేశాలకు తలొగ్గక తప్పలేదు.