MLC Anantha Babu: పోలీసులను ఆశ్రయించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాబాయి.. ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు

Driver Subrahmanyam uncle complaints against MLC Anantha Babus Family
  • అనంతబాబు కుటుంబం నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వీధి శ్రీను
  • దళిత, ప్రజా సంఘాల నేతలతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు
  • తమ కుమారుడు బయటకు రాగానే అంతు చూస్తామని అనంతబాబు తల్లి హెచ్చరించారన్న వీధి శ్రీను
  • రక్షణ కల్పించి, ప్రాణాలు కాపాడాలని పోలీసులను వేడుకున్నామన్న శ్రీను
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాబాయి వీధి శ్రీను పోలీసులను ఆశ్రయించారు. అనంతబాబు కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ కాకినాడ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజా, దళిత సంఘాల నాయకులు కూడా ఆయన వెంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా వీధి శ్రీను మాట్లాడుతూ.. అనంతబాబు కుటుంబం నివసిస్తున్న శంకర్ టవర్స్‌లో తాను వాచ్‌మన్‌గా పనిచేస్తున్నట్టు చెప్పారు. తన అన్నయ్య కుమారుడి హత్య కేసులో సాక్షులుగా ఉన్న తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 5న అనంతబాబు తల్లి, సోదరి తన కుమార్తెను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. 

‘‘ఇక్కడ పనిలో పెట్టామన్న విశ్వాసం కూడా లేకుండా నా కుమారుడిని జైలుపాలు చేస్తారా? మా వాడు బయటకు రాగానే మీ అంతు చూస్తాం’’ అని అనంతబాబు తల్లి హెచ్చరించారన్నారు. తమను చంపుతామని బెదిరించిన అనంతబాబు తల్లి, సోదరిపై చర్యలు తీసుకుని తమ ప్రాణాలను కాపాడాలని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నామని చెప్పారు. కాగా, అనంతబాబు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని దళిత, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
MLC Anantha Babu
Kakinada
Subrahmanyam
Andhra Pradesh

More Telugu News