హైదరాబాద్‌లో స‌ఫ్రాన్ ఏరో ఇంజిన్ రిపేర్ యూనిట్‌.. వెల్‌క‌మ్ చెబుతూ కేటీఆర్ ట్వీట్‌

06-07-2022 Wed 14:46
  • ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌కు చెందిన స‌ఫ్రాన్ కంపెనీ
  • హైద‌రాబాద్‌లో విమానాల ఎంఆర్ఓను ఏర్పాటు చేయ‌నున్న స‌ఫ్రాన్‌
  • 150 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న ఫ్రాన్స్ కంపెనీ
  • 1,000 మంది యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తుంద‌న్న కేటీఆర్‌
 SAFRAN select Hyderabad for its Mega Aero Engine MRO in India
ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఏరో ఇంజిన్ రిపేర్ సంస్థ స‌ఫ్రాన్ తెలంగాణ‌లోకి అడుగుపెట్ట‌బోతోంది. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఆ సంస్థ విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపేర్ (ఎంఆర్ఓ) యూనిట్‌ను నెల‌కొల్ప‌నుంది. హైదరాబాద్‌లో నెల‌కొల్ప‌నున్న ఎంఆర్ఓ యూనిట్ ఆ సంస్థ అన్ని యూనిట్ల‌లోకి అతి పెద్ద‌దిగా నిల‌వ‌నుంది. హైద‌రాబాద్ యూనిట్ కోసం ఆ కంపెనీ తొలి విడ‌త‌గా 150 మిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది.

హైద‌రాబాద్‌లో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన స‌ఫ్రాన్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఏరో ఇంజిన్ రిపేర్ రంగంలో భారత్‌లో ఇప్ప‌టిదాకా ఏ విదేశీ కంపెనీ త‌న యూనిట్‌ను ఏర్పాటు చేయ‌లేద‌న్న కేటీఆర్‌...హైద‌రాబాద్‌లో సఫ్రాన్ ఏర్పాటు చేయ‌నున్న యూనిట్ భార‌త్‌లో తొలి విదేశీ కంపెనీ యూనిట్‌గా రికార్డుల‌కు ఎక్క‌నుంద‌ని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 800 నుంచి 1,000 మంది యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా ఈ యూనిట్ ద్వారా ఏరోస్పేస్ రంగంలో హైద‌రాబాద్‌కు మ‌రిన్ని పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న తెలిపారు.