గుర్రంపై స్విగ్గీ ఆర్డర్ల డెలివరీ.. డెలివరీ బోయ్ ఆచూకీ చెప్పాలంటూ స్విగ్గీ ఆఫర్

06-07-2022 Wed 11:59
  • ముంబైలో తెల్లటి గుర్రంపై స్విగ్గీ బోయ్ సవారీ
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
  • అతడి వివరాలు తమతో పంచుకోవాలని కోరిన స్విగ్గీ
  • రూ.5,000 గిప్ట్ గా ఇస్తామని ప్రకటన
Swiggy offers reward for info on their accidental brand ambassador the delivery man on horse
స్విగ్గీలో ఆర్డర్ చేస్తే.. గుర్రంపై వచ్చి డెలివరీ చేయడం ఎప్పుడైనా చూశారా..? ముంబైలో ఇటీవలే ఈ వింత చోటు చేసుకుంది. స్విగ్గీ లోగోతో ఉన్న బ్యాగ్ ను భుజాలకు తగిలించుకున్న వ్యక్తి గుర్రం ఎక్కి ముంబై నడిరోడ్డులో.. వర్షానికి తడుస్తూ వెళుతున్న వీడియో ఒకటి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆర్డర్ల డెలివరీకి గుర్రాన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడన్నదే ఎక్కువ మందికి వచ్చిన అనుమానం. పెద్ద ఎత్తున నెటిజన్లు దీనికి స్పందిస్తున్నారు. దీంతో స్విగ్గీ కూడా రంగంలోకి దిగక తప్పలేదు.

గుర్రంపై వెళుతున్న వ్యక్తి వివరాలు తమకు తెలియజేస్తే.. వారి స్విగ్గీ ఖాతాలో రూ.5,000 జమ చేస్తామంటూ ప్రకటించింది. ‘‘మా మోనోగ్రామ్డ్ డెలివరీ బ్యాగ్ తగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి తెల్లటి గుర్రంపై కూర్చుని వెళుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. ఆ వ్యక్తి సొంత ఆలోచన, వాహనం ఎంపికను మేము అభినందించాలని అనుకుంటున్నాం. మీ మాదిరే మేము కూడా ఆ వ్యక్తి ఎవరో గుర్తించలేకున్నాం’’ అంటూ స్విగ్గీ ప్రకటన విడుదల చేసింది. 

‘‘దయచేసి ముందుకు రండి. ఉత్తమ భారత పౌరుడిగా మీ వంతు సహకారం అందించండి. ఎందుకంటే గుర్రంపై ఉన్న స్విగ్గీమ్యాన్ ఎవరో దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది’’ అని పేర్కొంది.