Telangana: విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టలేని నీ పాలనకు సెలవు దొర అంటూ కేసీఆర్​పై సంజయ్​ విమర్శలు

Sanjay criticizes KCR over incidents of insect rice to students in schools
  • పాఠశాలల్లో విద్యార్థులకు పురుగుల అన్నం ఘటనలపై స్పందించిన బండి
  • పౌష్టికాహారం దేవుడెరుగు.. పట్టెడన్నం పెట్టలేవు అంటూ ట్వీట్
  • పురుగుల అన్నం వడ్డిస్తున్నారంటూ పలు చోట్ల విద్యార్థుల ఆందోళన
రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించిన ఘటనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పౌష్టికాహారం దేవుడెరుగు, విద్యార్థులకు పట్టెడన్నం పెట్టడం లేదన్నారు. 

‘పురుగులతో నిండిన కూడా పిల్లలకు పెట్టేది? నువ్వు ఎల్గపెడ్తా అన్న బంగారు తెలంగాణ ఇదేనా? చిన్న పిల్లలని కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర! మంచి భోజనం కూడా పెట్టలేని నీ పాలనకు సెలవు దొర !!’ అని సంజయ్ ట్వీట్ చేశారు. 

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకుల విద్యా సంస్థల్లో అందిస్తున్న భోజనం తిని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఐదురోజులుగా పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. పురుగుల అన్నం తినలేక చాలామంది విద్యార్థులు కడుపు మాడ్చుకుంటున్నట్టు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు సిద్ధిపేట, గద్వాల జిల్లాల్లోని గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
Telangana
BJP
Bandi Sanjay
cm kcr
Twitter
food
students

More Telugu News