England: ఇంగ్లండ్ చేతుల్లోకి మ్యాచ్.. విజయానికి 119 పరుగుల దూరంలో స్టోక్స్ సేన

  • నాలుగో రోజు తడబడిన భారత్
  • 120 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వైనం
  • మూడు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • బౌలర్లపైనే భారం వేసిన భారత్
Root and Bairstow put England on course in historic chase

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు నాలుగో రోజు మ్యాచ్‌పై భారత్ పట్టుకోల్పోయింది. విజయానికి స్టోక్స్ సేన దగ్గరైంది. 378 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిన్న ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి విజయానికి 119 పరుగుల దూరంలో నిలిచింది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉండడంతో విజయంపై ఆ జట్టు ధీమాగా ఉంది. 

ఇక భారత్ విజయం సాధించాలంటే వికెట్ల కోసం శ్రమించాల్సి ఉంటుంది. క్రీజులో జో రూట్ (76), బెయిర్ స్టో (72) పాతుకుపోయి ఉండడంతో ఆతిథ్య జట్టు విజయం ఖాయంగానే కనిపిస్తోంది. ఓపెనర్లు లీస్‌ 56, క్రాలే 46 పరుగులు చేయగా, ఒల్లీ పోప్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ కోల్పోయిన మూడు వికెట్లలో రెండు బుమ్రాకే దక్కాయి.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 125/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో 120 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. నాలుగో రోజు మ్యాచ్‌లో పంత్ (57) అర్ధ సెంచరీ సాధించడం మినహా భారత జట్టులో ఎవరూ రాణించలేకపోయారు. క్రీజులోకి వచ్చిన వారు నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా 245 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ 4 వికెట్లు తీసుకోగా బ్రాడ్, పాట్స్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. చివరి రోజైన నేడు భారత బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనే దానిపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

More Telugu News