Telangana: అల్పపీడన ప్రభావం.. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

Heavy rains expected in Telangana for next 3 days
  • ఉత్తర ఛత్తీస్‌గఢ్ తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం
  • నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వాన
  • పరవళ్లు తొక్కుతున్న కుంటాల, పొచ్చెర్ల జలపాతాలు
  • వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

 ఉత్తర ఒడిశా, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత అది వాయవ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్‌గఢ్ తీరంలో కేంద్రీకృతమైంది. అది స్థిరంగా కొనసాగుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం పడింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 12.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోనూ నిన్నంతా వర్షం కురిసింది. రామాంతపూర్‌లో 3.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ సమీపంలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
Telangana
Rains
Hyderabad
Kuntala Water Falls

More Telugu News