Tamilnadu: పార్క్​ చేసిన బైక్​ పై నుంచే రోడ్డు వేసేశారు.. తమిళనాడులోని వెల్లూర్​ మున్సిపాలిటీ నిర్వాకం

  • సాయంత్రం ఇంటి ముందు బైక్ పార్క్ చేసిన మురుగన్ అనే వ్యక్తి
  • రాత్రే సీసీ రోడ్డు వేసిన మున్సిపాలిటీ కాంట్రాక్టర్
  • పొద్దున లేచి చూసే సరికి రోడ్డులో చిక్కుకుపోయి ఉన్న బైక్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • పర్మిషన్ లేకుండానే రోడ్డు వేసేశారంటూ కాంట్రాక్టర్ కు కమిషనర్ నోటీసులు
cement road laid with parked bike in tamilnadu

అది తమిళనాడులో వెల్లూర్ మున్సిపాలిటీలోని గాంధీ రోడ్ ప్రాంతం. ఎస్. మురుగన్ అనే ఆయన రోజూలాగే సాయంత్రం తన బైక్ ను ఇంటి ముందు పార్క్ చేశాడు. మళ్లీ బయటికి రాలేదు. రాత్రి ఇంట్లోనే పడుకుండిపోయాడు. ఉదయం లేచి బయటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రెడీ అయిపోయి.. బైక్ తాళాలు తీసుకుని బయటికి వచ్చాడు. కానీ ఇంటి ముందు పరిస్థితి చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే.. రాత్రి ఆ గల్లీలో సిమెంట్ (సీసీ) రోడ్డు వేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ అలా ఉండగానే సిమెంట్ కాంక్రీట్ నింపేశారు. దానితో బైక్ ముందు, వెనక టైర్లు, స్టాండ్ ఆ సిమెంట్ రోడ్డులో చిక్కుకుపోయి ఉన్నాయి.

కనీసం చెప్పకుండానే..
తాను రోజూ ఇంటి ముందే బైక్ పార్క్ చేసి పెట్టుకుంటానని యజమాని మురుగన్ చెప్పారు. అదే తరహాలో ఇంటి ముందు బైక్ పెట్టానని పేర్కొన్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా తాను ఇంట్లో నిద్ర పోకుండా ఉన్నానని.. కనీసం పిలవకుండానే బైక్ ను అలాగే ఉంచే రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు రోడ్డుపై నీళ్లు డ్రైనేజీలోకి వెళ్లే రంధ్రాలనూ సిమెంట్ తో మూసేశారని మండిపడ్డారు.

వీడియో వైరల్ కావడంతో..
పార్క్ చేసిన బైక్ ను అలాగే ఉంచేసి రోడ్డు వేయడంపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో వెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. చిత్రమేమిటంటే.. అసలు ఆ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ కు తాము అనుమతి ఏమీ ఇవ్వలేదని.. రోడ్డు ఎలా వేశారని కమిషనర్ పేర్కొన్నారు. ‘ఈ ఘటనతో మేమూ ఆశ్చర్యపోయాం. ఇలాంటివి మున్సిపల్ కార్పొరేషన్ కు చెడ్డపేరు తెస్తాయి. కాంట్రాక్టర్ కు నోటీసు జారీ చేశాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం..” అని కమిషనర్ పేర్కొన్నారు.

More Telugu News