పంజాబ్ లో ఇక నెలకు 300 యూనిట్ల కరెంటు ఫ్రీ.. శుక్రవారం నుంచే అమల్లోకి: సీఎం భగవంత్ మాన్ ప్రకటన

  • ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నట్టు ప్రకటించిన సీఎం భగవంత్ మాన్
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ పై హామీ ఇచ్చిన ఆప్
  • దేశంలో ఇలా ఉచిత విద్యుత్ ఇస్తున్న ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లో ఆప్ ప్రభుత్వాలే..
300 units of electricity free per month Effective from Friday says Punjab CM

పంజాబ్ రాష్ట్రంలో నివాస గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల మేర విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. శుక్రవారం నుంచే ఈ ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్టు తెలిపారు.

మరో హామీ అమల్లోకి తెస్తున్నాం..
‘‘గతంలో పాలించిన పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండానే ఐదేళ్ల పాలనా కాలాన్ని గడిపేయడం చేసేవి. కానీ మేం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం. పంజాబ్ చరిత్రలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాం. పంజాబీలకు ఇచ్చిన మరో హామీని అమల్లోకి తెస్తున్నాం. ఈ రోజు నుంచి పంజాబ్ లోని ప్రతి కుటుంబం ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను పొందుతుంది” అని భగవంత్ మాన్ శుక్రవారం ట్వీట్ చేశారు.

దేశంలో రెండో రాష్ట్రం పంజాబ్
దేశంలో ఢిల్లీ తర్వాత ప్రజల నివాసాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్న రెండో రాష్ట్రం పంజాబ్ అని ఆప్ నేత, ఎంపీ గౌరవ్ చద్దా పేర్కొన్నారు. రెండూ ఆప్ ప్రభుత్వాలేనని చెప్పారు. ‘‘పంజాబ్ కు ఇది చారిత్రాత్మకమైన రోజు. దేశంలో ఢిల్లీ తర్వాత పంజాబ్ లో ప్రజలు ఉచిత విద్యుత్ అందుకుంటున్నారు. పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ ఇచ్చిన హామీ రూపం దాల్చింది” అని పేర్కొన్నారు. నివాసాలకు ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,800 కోట్లు భారం పడుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా అంచనా వేశారు.

More Telugu News