పీఎస్ఎల్వీ సి-53 రాకెట్ ప్రయోగం సక్సెస్... ఇస్రో శాస్త్రవేత్తల్లో జోష్

ISRO successfully conducts PSLV C53 voyage
  • శ్రీహరికోట నుంచి ప్రయోగం
  • నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో నమ్మినబంటు
  • విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన వైనం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనవిజయం అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-53 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఈ సాయంత్రం 6.02 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో నమ్మినబంటు పీఎస్ఎల్వీ అన్ని దశలను సజావుగా పూర్తిచేసుకుంది. 

సింగపూర్ కు చెందిన డీఎస్-ఈవో ఉపగ్రహంతో పాటు, న్యూసార్, స్కూబ్-1 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ మూడింట్లో డీఎస్-ఈవో బరువు 365 కేజీలు కాగా, అతి చిన్నదైన స్కూబ్-1 బరువు 2.8 కేజీలు మాత్రమే. తాజా ప్రయోగం సంతృప్తికరంగా ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంతోషం వెల్లివిరిసింది. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

గత కొంతకాలంగా ఇస్రో వాణిజ్య ప్రాతిపదికన ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లను కూడా రోదసిలోకి తీసుకెళుతోంది. ఇప్పటిదాకా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. 2016లో పీఎస్ఎల్వీ సి-37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం చరిత్ర సృష్టించింది. ఇస్రో చాలా తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేపడుతుండడంతో అనేక దేశాలు భారత్ వైపు మొగ్గుచూపుతున్నాయి.
Go Back to Shorts
PSLV C-53
ISRO
Sriharikota
India

More Telugu News