వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్​

28-06-2022 Tue 16:54
  • గీత రచయిత జావేద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో హాజరుకానున్న కంగన
  • సోమవారమే హాజరుకావాల్సి ఉన్నా మినహాయింపు కోరిన లాయర్
Kangana Ranaut To Appear Before Mumbai Court On July 4 In Defamation Case
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వచ్చే నెల 4న ముంబై కోర్టులో హాజరుకానున్నారు. బాలీవుడ్ ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో ఆమె సోమవారమే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఈ ఒక్క రోజుకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆమె లాయర్ కోరడంతో.. కేసు విచారణను వచ్చే నెల 4న చేపట్టేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

ఏమిటీ కేసు?
2020 నవంబర్ లో కంగనా రనౌత్ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జావేద్ అక్తర్ పై ఆరోపణలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ లో కొందరిని తొక్కివేసేందుకు ఓ కోటరీ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆ కోటరీలో జావేద్ అక్తర్ భాగమంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు తన పరువుకు నష్టం కలిగించాయంటూ అదే నెలలో జావేద్ అక్తర్ కోర్టులో కేసు వేశారు. దానిపై విచారణ కొనసాగుతోంది.