పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు: మోహన్ బాబు

28-06-2022 Tue 14:38
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కోర్టుకు హాజరైన మోహన్ బాబు
  • తదుపరి విచారణ సెప్టెంబర్ 20కి వాయిదా
  • సంతకం పెట్టాం, బయల్దేరుతున్నామన్న మోహన్ బాబు
Mohan Babu leaves court
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో సినీ నటుడు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లతో కలిసి తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. కోర్టు నుంచి బయటకు వచ్చాక మీడియాతో మోహన్ బాబు మాట్లాడుతూ... వాస్తవానికి తనకు సమన్లు అందలేదని... అయినా జడ్జి పిలిచారని వచ్చానని, ఆయన సమక్షంలోనే సమన్లపై సంతకం చేశానని చెప్పారు. సంతకం పెట్టాం, బయల్దేరుతున్నామని అన్నారు. 

మరోవైపు తిరుపతి ఎన్టీఆర్ సెంటర్ నుంచి వీరు పాదయాత్రగా వచ్చారనే వార్తలపై మోహన్ బాబు స్పందిస్తూ... పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడని ప్రశ్నించారు. కారులో వచ్చి అక్కడ దిగామని... అక్కడ మా కోసం వచ్చిన జనం ఉన్నారని... హ్యాపీగా వాళ్లతో నడుచుకుంటూ వచ్చి, కోర్టులోకి వెళ్లామని చెప్పారు.

2019లో తిరుపతిలో తన శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి ధర్నా చేసిన కేసులో కోర్టు విచారణ కోసం ఆయన వచ్చారు. అది ఎన్నికల సమయం కావడంతో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసు నమోదయింది. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ లతో పాటు శ్రీవిద్యానికేతన్ ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్ లపై కూడా కేసు నమోదయింది.