ఆహారంలో సూపర్​ ఫుడ్స్​ తీసుకోండి ఇలా.. ఆరోగ్యం మీ సొంతమవుతుంది

27-06-2022 Mon 17:20
  • సులువుగా శరీరానికి అందించేలా నిపుణుల సూచనలు
  • శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని వెల్లడి
  • ఎనిమిది రకాలుగా తీసుకోవచ్చంటున్న నిపుణులు
  • దీర్ఘకాలికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయని స్పష్టీకరణ
8 Innovative Easy Ways To Incorporate Superfoods Into Your Diet
మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. సాధారణ ఆహారంతో పాటు అత్యవసరమైన పోషకాలు ఉండే సూపర్ ఫుడ్స్ కూడా అవసరమే. అంటే ఇవేవో అరుదైనవో, ఖరీదైనవో కాదు.. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో భాగంగానే ఉండే పదార్థాలే. కానీ అవి రోజూ అందడం వల్ల మన శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ తినే సాధారణ ఆహారంలో వీటిని కొద్దికొద్దిగా చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలికంగా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయని వివరిస్తున్నారు.

మరి ఏయే సూపర్ ఫుడ్స్ ను రోజు వారీగా ఏ విధంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందన్న దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఎనిమిది రకాలుగా వీటిని తీసుకోవచ్చని చెబుతున్నారు. ఆ సూపర్ ఫుడ్స్, తీసుకునేందుకు వీలైన వివరాలివీ..

1. డ్రై సీడ్స్ ను పైన చల్లుకుంటూ..
గుమ్మడి గింజలు, చియా, జనము, డ్రైఫ్రూట్స్ లో భాగంగా ఉండే ఇతర విత్తనాలు/గింజలను సూపర్ ఫుడ్స్ లో ఒకటిగా నిపుణులు చెప్తున్నారు. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, జింక్, మెగ్నీషియం, రాగి, విటమిన్లు వంటి ఆవశ్యక పోషకాలు ఉంటాయని వివరిస్తున్నారు. వీటిని వివిధ వంటకాలు, ఆహార పదార్థాలు, చిరుతిళ్లపై చల్లుకుంటూ తింటే మంచిదని సూచిస్తున్నారు.

2. డార్క్ చాకోలెట్ కలుపుకొంటూ..
సాధారణంగా చాకోలెట్లు అనగానే ఆరోగ్యానికి మంచిది కాదని అంటుంటారు. కానీ చక్కెర, ఇతర పదార్థాలు పెద్దగా కలపని డార్క్ చాకోలెట్ ఆరోగ్యానికి మంచిదని.. దానిలో పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇళ్లలో సిద్ధం చేసుకునే డెసర్ట్స్ (కేకులు, ఓట్స్ పాయసం, ఫ్రూట్ సలాడ్స్ వంటివి)లో కలుపుకోవడం ద్వారానూ, నేరుగా పాలలో కలుపుకోవడం ద్వారానూ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

3. డ్రై ఫ్రూట్ నట్స్ చిరుతిండిగా..
డ్రై ఫ్రూట్ నట్స్ ను ఉదయం, సాయంత్రం చిరు తిండి (స్నాక్స్)గా తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందని.. వాటిలో అనేక రకాల పోషకాలతోపాటు ఒమేగా –3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండేవారికి ఇవి ఎంతో ప్రయోజనకరమని స్పష్టం చేస్తున్నారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు జంక్ ఫుడ్ కు బదులుగా వీటిని పెట్టుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామని అంటున్నారు. 

4. కాలిఫ్లవర్ రైస్ తో..
కాలిఫ్లవర్ లో ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలెన్నో ఉన్నాయని, దీనిని తరచూ తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం సొంతమవుతుందని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. బ్రౌన్ రైస్ తో అన్నం వండి పెట్టుకోవాలని.. కాలిఫ్లవర్ ను కొద్ది నిమిషాల పాటు ఉడకబెట్టి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలని.. తర్వాత ఈ రెండింటినీ కలిపి కాలీఫ్లవర్ రైస్ గా చేసుకుని తింటే బాగుంటుందని వివరిస్తున్నారు.

5. పెరుగుతో రకరకాల ఫుడ్..
అటు శరీరానికి అవసరమైన పోషకాలతోపాటు ఇటు జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరించే లక్షణాలు పెరుగులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని అటు తీపి పదార్థాల్లో భాగంగాను, ఇటు సాధారణ ఆహారంలో భాగంగానూ వినియోగించుకోవచ్చని అంటున్నారు. ఎలాగైనా సరే నిత్యం పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. 

6. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ.. నేరుగా, స్నాక్స్ గా..
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి వాటిలో చక్కెరల శాతం తక్కువగా ఉండటమేగాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో క్యాండీలు, ఐస్ క్రీమ్ ల వంటివి తయారుచేసుకుని తింటే ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు. బెర్రీస్ ను గ్రైండ్ చేయడం, లేదా చిన్నచిన్న ముక్కలుగా చేసి.. దానిలో కొంత నిమ్మరసం పిండి డీప్ ఫ్రీజర్ లో ఉంచడం ద్వారా ఐస్ క్రీమ్ లను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. 

7. గ్రీన్ టీ.. రోజులో అప్పుడప్పుడూ..
యాంటీ ఆక్సిడెంట్లు, పలు రకాల పోషకాలకు గ్రీన్ టీ నిలయం. దీనిని ఓ వైపు వేడి వేడి టీ గాను, మరోవైపు చల్లని ఐస్ టీ గానూ చేసుకుని తాగవచ్చని నిపుణులు అంటున్నారు. ఇష్టాన్ని బట్టి గ్రీన్ ఐస్ టీలో నిమ్మకాయ, తేనె వంటివి కలుపుకొంటే మంచి సూపర్ ఫుడ్ అని వివరిస్తున్నారు.

8. వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ రూపంలో..
ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి రెండూ కూడా మంచి సూపర్ ఫుడ్స్ అన్న విషయం ఎప్పటి నుంచో తెలుసు. కేవలం పోషకాలు మాత్రమే కాదు శరీరంలో దెబ్బతిన్న కణజాలాలను పునరుద్ధరించడానికి తోడ్పడే ఎన్నో పదార్థాలు వీటిలో ఉంటాయి. పొట్టు తీసి సన్నగా తరిగిన వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ ను కలిపి ఓవెన్లో ఉడికించడం ద్వారా వెల్లుల్లి–ఆలివ్ ఆయిల్ తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టర్ (వెన్న)కు బదులుగా వినియోగించడం, ఆహారంలో వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు.