Satrucharla Pallavi: మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై శత్రుచర్ల కుటుంబీకుల ఫైర్

  • కురుపాంలో పల్లవిరాజు ప్రెస్ మీట్
  • చర్చకు సిద్ధమని సవాల్
  • చినమేరంగికోటలో టీడీపీ నేతల సమావేశం
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విజయరామరాజు
Satrucharla clan fires on former minister Pushpa Srivani

టీడీపీ నేత శత్రుచర్ల పల్లవిరాజు మన్యం జిల్లా కురుపాంలో మీడియా సమావేశం నిర్వహించి మాజీమంత్రి పుష్పశ్రీవాణిపై ధ్వజమెత్తారు. తన తండ్రి చంద్రశేఖర్ రాజు పుణ్యమా అని పుష్పశ్రీవాణి గెలిచారని వ్యాఖ్యానించారు. తన ఆస్తుల వివరాలపై పుష్పశ్రీవాణి కులదైవం ముందు ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. మీ ఆస్తుల వివరాల ఆధారాలతో సహా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం అని పల్లవిరాజు ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి స్పష్టం చేశారు. గడపగడపకు కార్యక్రమంలో ప్రశ్నించినవారిపై కేసులు పెడతారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 

అటు, మన్యం జిల్లా చినమేరంగికోటలో ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ పుష్పశ్రీవాణి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పుష్పశ్రీవాణి శత్రుచర్ల బ్రాండ్ పెట్టుకుని రాజకీయం చేస్తోందని విజయరామరాజు అన్నారు. వ్యక్తిగతంగా రాజకీయంలోకి దిగితే నీ ఓటు బ్యాంకు ఎంతో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 

"రూ.5 కోట్ల ఆస్తులు ఉన్నట్టు రుజువు చేయాలని, రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పుష్పశ్రీవాణి సవాల్ చేశారు. పుష్పశ్రీవాణికి రూ.500 కోట్లకు పైబడి ఆస్తులు ఉన్నట్టు రుజువు చేస్తాం. దీనిపై ఎక్కడ చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నాం" అని విజయరామరాజు స్పష్టం చేశారు. పోలీసులు లేకుండా గడపగడపకు తిరిగితే మీ అభివృద్ధి ఏంటో తెలుస్తుంది అని అన్నారు. టీడీపీ నేతలపై చిటికలు వేస్తే మీ వేళ్లు లేకుండా చేస్తాం అని హెచ్చరించారు. మాపై ఎలా దాడి చేస్తే అదే మాదిరి మేము కూడా దాడి చేస్తాం అని శత్రుచర్ల విజయరామరాజు ఉద్ఘాటించారు.

More Telugu News