శివసేన పార్టీలో ముసలం పుణ్యమా అని అసోం వరదల అంశం అందరికీ తెలిసింది: సీఎం హిమంత బిశ్వ శర్మ

  • చీలిన శివసేన పార్టీ
  • అసోంలో ఆతిథ్యం పొందుతున్న శివసేన రెబల్స్
  • స్పందించిన అసోం సీఎం
  • శివసేన సంక్షోభంలో తమ పాత్ర లేదని స్పష్టీకరణ
  • కాంగ్రెస్ వాళ్లు వచ్చినా ఇలాగే ఆతిథ్యమిస్తామని వెల్లడి
Himanta Biswa Sarma talks about Shiv Sena revolt

నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత కొన్నిరోజులుగా అసోంను కుండపోత వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే, శివసేన పార్టీ రెబెల్ ఎంపీలు గుజరాత్ లోని సూరత్ వెళ్లి, అక్కడి నుంచి అసోం చేరుకుని అక్కడి నుంచి క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. దాంతో జాతీయ మీడియా దృష్టి అసోంపై పడింది. ఈ నేపథ్యంలో, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు గువాహటిలోని ఓ హోటల్ లో ఆశ్రయం ఇస్తున్నారన్న ఆరోపణలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. శివసేన పార్టీలో సంక్షోభం ఏమో కానీ, దానివల్ల అసోంలో వరదల అంశం అందరికీ తెలిసిందని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీలో ముసలం ఏర్పడడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ సీఎం స్పష్టం చేశారు. 

"గువాహటిలో మాకు 200 హోటళ్లు ఉన్నాయి. వాటన్నింటిలోనూ అతిథులు బస చేసి ఉన్నారు. వరదలు వచ్చాయని చెప్పి వాళ్లందరినీ ఖాళీ చేయిస్తామా?" అని ప్రశ్నించారు. మహారాష్ట్ర రెబెల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు మాత్రమే ఇస్తోందని, అయితే, అందులో తన జోక్యం ఏమీలేదని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. 

"బయటి నుంచి వచ్చి ఇక్కడ ఆతిథ్యం పొందేవారికి భద్రత, సౌకర్యవంతమైన బస ఏర్పాటు చేయడం మా విధి. రేపు కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లు వచ్చినా, వారికి కూడా ఇదే రీతిలో ఆతిథ్యం ఇస్తాం. అయితే శివసేన వాళ్లు ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. ఎందుకంటే వాళ్లు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడి వరదల అంశం హైలైట్ అయింది" అని శర్మ వివరించారు.

More Telugu News