Droupadi Murmu: చారిత్రాత్మక ఘట్టం.. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు

  • నామినేషన్ పత్రాలపై తొలుత పీఎం మోదీ సంతకం
  • తర్వాత అమిత్ షా, రాజ్ నాథ్, నడ్డా సంతకాలు
  • హాజరైన బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు
  • వైసీపీ, బీజూ జనతదాళ్ మద్దతు
Droupadi Murmu files presidential polls nomination in PM Modis presence

ఝార్ఖండ్ మాజీ గవర్నర్, ఒడిశాకు చెందిన బీజేపీ నేత ద్రౌపది ముర్ము అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. 

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని మొదటగా ప్రధాని మోదీ ప్రతిపాదించారు. నామినేషన్ పత్రాలపై మోదీతోపాటు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా సంతకాలు చేశారు. 

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పోటీ చేయనుండడం తెలిసిందే. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి బిజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు పలికాయి. దీంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా సునాయాసంగా ఎన్నిక కానున్నారు. 

ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 10,86,431 కాగా, ఎన్డీయేకి 5,32,351 ఓట్లు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు 45,550 ఓట్లు, బీజేడీకి 31,686 ఓట్లు, అన్నాడీఎంకేకు 14,940 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ముర్ముకే పడనున్నాయి. చిన్న వయసులోనే (64) రాష్ట్రపతిగా ఎన్నికైన మహిళగా ముర్ము చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాదు, రాష్ట్రపతి స్థానాన్ని అలంకరించే తొలి గిరిజన మహిళ కూడా ఆమే అవుతారు. 

అంతకుముందు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, మిస్రా ముండా విగ్రహాల వద్ద ఆమె నివాళులు అర్పించారు. 

More Telugu News