Shoaib: జట్టులోకి ఎంపిక చేయలేదని ఆత్మహత్యకు ప్రయత్నించిన పాక్ దేశవాళీ క్రికెటర్

  • పాక్ లో ఇంటర్ సిటీ చాంపియన్ షిప్
  • షోయబ్ అనే ఫాస్ట్ బౌలర్ కు దక్కని స్థానం
  • కోచ్ ఎంపిక చేయలేదంటూ తీవ్ర మనస్తాపం
  • మణికట్టు కోసేసుకున్న వైనం.. పరిస్థితి విషమం
Pakistan domestic cricketer attempts suicide after he ignored from selection trails

ఒక్కోసారి ఎంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, జట్టులో చోటు లభించకపోవడం ప్రతి క్రికెటర్ కు ఏదో ఒక దశలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే పాకిస్థాన్ లోని సదరన్ సింధ్ ప్రావిన్స్ కు చెందిన షోయబ్ అనే దేశవాళీ క్రికెటర్ జట్టులో స్థానం లభించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కోచ్ తీరు పట్ల తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంటర్ సిటీ చాంపియన్ షిప్ కోసం కోచ్ తనను ఎంపిక చేయకపోవడంతో షోయబ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. 

ఫాస్ట్ బౌలర్ అయిన షోయబ్... కోచ్ తీరు పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మానసిక వ్యధతో తన గదికే పరిమితమయ్యాడు. చనిపోవాలన్న ఉద్దేశంతో మణికట్టు కోసుకున్నాడు. బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

కాగా, 2018లోనూ ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. కరాచీ అండర్-19 జట్టు నుంచి తనను తొలగించడంతో ముహమ్మద్ జర్యాబ్ అనే యువ క్రికెటర్ ఉరేసుకుని చనిపోయాడు.

More Telugu News