Vijayashanti: తెలంగాణ మరో శ్రీలంకలా మారబోతోంది: విజయశాంతి

Vijayasanthi criticized CM KCR
  • సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన విజయశాంతి
  • అప్పు పుడితేనే తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి అని వెల్లడి
  • ప్రభుత్వ పథకాలకు కూడా నిధులు లేవని వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో కుటుంబ పాలన అంటూ విమర్శలు
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులకుప్పగా మార్చేశారని బీజేపీ మహిళా నేత విజయశాంతి ధ్వజమెత్తారు. ఏ నెలకు ఆ నెల అప్పు పుడితేనే జీతాలు, పింఛన్లు చెల్లించే పరిస్థితి ఉందని, కొత్త అప్పు తీసుకురాకపోతే ఒక్క రోజు కూడా గడిచే పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు చిల్లిగవ్వ కూడా లేదని, తెలంగాణ మరో శ్రీలంకలా మారబోతోందని విజయశాంతి పేర్కొన్నారు. 

పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు లేవని, మొత్తమ్మీద మూడు నెలలుగా రాష్ట్ర ఖజానా నుంచి పైసా తీయడంలేదని ఆరోపించారు. అప్పు వస్తేనే నిధులు సర్దుబాటు అవుతాయని, అప్పటిదాకా పైసలు ఇవ్వలేమని వివిధ శాఖలకు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ తేల్చిచెబుతోందని వివరించారు. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వహించిన బాండ్ల వేలం ప్రక్రియలోనూ తెలంగాణకు చోటు దక్కలేదని విజయశాంతి వెల్లడించారు. 

గడచిన రెండున్నర నెలల్లో వివిధ పథకాల కింద లబ్దిదారులకు రూ.15 వేల కోట్లు అందాల్సి ఉండగా, కేసీఆర్ సర్కారు మాత్రం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని పేర్కొన్నారు.. ఈ విధంగా కుటుంబ పాలనతో తెలంగాణను మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ అండ్ కో త్వరలోనే పర్మినెంటుగా ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకోవడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.
Vijayashanti
CM KCR
Telangana
Sri Lanka

More Telugu News