Rajya Sabha: నేటి నుంచి రాజ్య‌స‌భ కొత్త స‌భ్యుల ప‌ద‌వీ కాలం ప్రారంభం... కేర‌ళ గవ‌ర్న‌ర్‌తో విజ‌య‌సాయిరెడ్డి భేటీ

  • తిరువ‌నంత‌పురం టూర్‌లో విజ‌య‌సాయిరెడ్డి
  • కేర‌ళ గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయిన వైసీపీ ఎంపీ
  • ఈ నెల 24న ప్ర‌మాణం చేయ‌నున్న‌ట్లు ఆర్.కృష్ణ‌య్య ప్ర‌కట‌న‌
  • కొత్త‌గా ఎన్నికైన 57 మంది రాజ్య‌స‌భ స‌భ్యుల ప‌ద‌వీ కాలం నేటితో మొద‌లు
rejyasabha elected members tenure starts from today

రాజ్య‌స‌భ‌కు ఇటీవ‌లే ఎన్నికైన కొత్త స‌భ్యుల ప‌ద‌వీ కాలం బుధ‌వారంతో ప్రారంభం కానుంది. మంగ‌ళ‌వారంతో రాజ్య‌స‌భ స‌భ్యుల్లో 57 మంది ప‌ద‌వీ కాలం ముగియ‌గా.. ఆ సీట్ల భ‌ర్తీ కోసం గ‌త నెల‌లో ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సీట్ల‌లో తెలుగు రాష్ట్రాల కోటాలో ఏపీకి సంబంధించి 4 సీట్లు, తెలంగాణ కోటాలో 2 సీట్ల‌కు ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగానే ముగిశాయి. వీరు నేటి నుంచి రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప‌రిగ‌ణ‌న‌లోకి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భాన్ని తెలియ‌జేస్తూ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి బుధ‌వారం ఓ ట్వీట్ చేశారు. రాజ్య‌స‌భ‌లో త‌న రెండో టెర్మ్ నేటితో మొద‌లుకానుంద‌ని ఆయ‌న తెలిపారు. రాజ్య‌స‌భ‌లో త‌న రెండో టెర్మ్ మొద‌లైన బుధ‌వారం ఆయ‌న కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. తిరువ‌నంత‌పురంలో కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మొహ్మ‌ద్ ఖాన్‌ను ఆయ‌న మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

ఇదిలా ఉంటే... ఏపీ కోటా నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య బుధ‌వారం చెబుతూ.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా తాను ఈ నెల 24న ఢిల్లీలో ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వైసీపీ త‌ర‌ఫున సాయిరెడ్డి, కృష్ణ‌య్య‌ల‌తో పాటు నిరంజ‌న్‌రెడ్డి, బీద మ‌స్తాన్ రావులు ఎన్నిక‌య్యారు. కృష్ణ‌య్య‌తో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఈ నెల 24న‌నే ప్ర‌మాణం చేసే అవ‌కాశాలున్నాయి. తెలంగాణ కోటాలో పార్థ‌సారథి రెడ్డి, దామోద‌ర్ రావులు రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.

More Telugu News