Balance: ఒంటి కాలిపై కదలకుండా నిలబడగలరా.. మరణం మీకెంత దూరంలో ఉందో తెలిసిపోతుందంటున్న తాజా అధ్యయనం!

Middle age people who unable balance one leg likely die early
  • 60 ఏళ్లు దాటిన వారిపై బ్రెజిల్ శాస్త్రవేత్తల పరిశోధన
  • కదలకుండా నిలబడలేని వారిలో గుండె జబ్బులు, మధుమేహం
  • ఈ ‘ఫ్లెమింగో టెస్టు’లో ఫెయిలైతే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువని హెచ్చరిక
ఎన్ని వైద్య పరీక్షలు చేసినా.. మరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ శరీరంలోని కొన్ని లక్షణాలను బట్టి అనారోగ్య సమస్యలను దాదాపు కచ్చితంగా అంచనా వేసే విధానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా మనం ఒంటి కాలిపై ఏ మాత్రం కదలకుండా నిలబడగలిగే సమయాన్ని బట్టి ఇలాంటి అంచనాను బ్రెజిల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనికి ‘ఫ్లెమింగో టెస్ట్’ అని పేరు పెట్టారు. ఫ్లెమింగో పక్షులు (మన కొంగల వంటివి) ఒంటికాలిపై చాలాసేపు కదలకుండా నిలబడతాయి. అందుకే ఈ పరీక్షకు ఆ పేరు పెట్టారు.

ఏమిటీ పరిశోధన?
బ్రెజిల్ శాస్త్రవేత్తలు 1994 నుంచి జనం ఫిట్నెస్, వారి ఆరోగ్యానికి ఉన్న లింకుపై పరిశోధన చేస్తున్నారు. 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న 1,702 మందిని ఎంపిక చేసి వివిధ అంశాలను పరిశీలించారు. అందులో పది సెకన్ల ‘ఫ్లెమింగో టెస్ట్’ కూడా ఉంది. తర్వాత వారందరి ఆరోగ్యాన్ని కొన్నేళ్ల పాటు పరిశీలిస్తూ వచ్చారు. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలను తాజాగా బ్రెజిల్లోని రియో డి జెనెరియోలోని ‘క్లినిమెక్స్’ ఆస్పత్రి నిపుణులు క్షుణ్ణంగా సమీక్షించి.. నివేదికను విడుదల చేశారు.

ఎంతసేపు నిలబడితే.. ఏమిటి ఫలితం?
‘ఫ్లెమింగో టెస్ట్’లో పది సెకన్ల పాటు కదలకుండా, బ్యాలెన్స్ కోల్పోకుండా నిలబడగలిగినవారు ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. అలా నిలబడలేనివారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటివి అప్పటికే ఉండటమో, లేదా మొదలయ్యే స్థితిలో ఉండటమో జరిగినట్టు తేల్చారు. ‘ఫ్లెమింగో టెస్ట్’లో ఫెయిలైనవారు తర్వాతి పదేళ్లలో ఆరోగ్యం విషమించి మరణానికి చేరువయ్యే అవకాశాలు 84 శాతం ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.
  • ఈ టెస్టులో ఫెయిలైనవారిలో అధిక రక్తపోటు, ఊబకాయం వంటివీ ఉంటున్నట్టు తెలిపారు.
  • వయసు పెరుగుతున్న కొద్దీ ఒంటి కాలిపై బ్యాలెన్స్ చేస్తూ నిలబడే శక్తి తగ్గిపోతున్నట్టు తేల్చారు.
  • ఇది కేవలం బ్రెజిల్లో చేసిన పరిశోధన కాబట్టి.. ఇతర దేశాలు, ప్రాంతాల్లో ‘ఫ్లెమింగో టెస్టు’ ఫలితాలు వేరుగా ఉండవచ్చని.. కానీ ఒంటికాలి బ్యాలెన్స్ టెస్ట్ వల్ల కచ్చితంగా మనుషుల ఆరోగ్య స్థితి, మరణానికి చేరువయ్యే పరిస్థితిని గుర్తించవచ్చని స్పష్టం చేశారు.
  • సరిగా నిలబడలేకపోయినవారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని.. వ్యాయామాలు, తగిన ఆహారం తీసుకోవడం వంటివాటిపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎలా నిలబడి ‘ఫ్లెమింగో టెస్ట్’ చేసుకోవాలి? 
  • చదునుగా, సమతలంగా ఉన్న స్థలంలో చెప్పులు, బూట్లు వంటివేవీ లేకుండా నిలబడాలి.
  • తల, నడుము సహా శరీరమంతా నిటారుగా ఉంచుకోవాలి.
  • మెల్లగా కుడికాలిని వెనుకగా పైకెత్తి.. ఎడమకాలి మోకాలి కింది భాగంలో ఆనించాలి. ఈ సమయంలో కుడికాలి వేళ్లు, వాటి పైభాగం.. ఎడమకాలి కండరానికి ఆనుతూ ఉండాలి.
  • చేతులను రెండు పక్కలా కిందికి విశ్రాంతంగా వేలాడదీస్తున్నట్టుగా ఉంచాలి. తలను నిటారుగా ఉంచి సమాంతరంగా ఉన్న ఏదైనా వస్తువుపై దృష్టి సారించాలి.
  • ఇదంతా పూర్తయ్యాక కదలకుండా కనీసం పది సెకన్లకుపైగా నిలబడాలి.
Balance
Balance on one leg
Stand on one leg
Health
High Blood pressure
Sugar
Age
Health problems
Flemingo Teslt

More Telugu News