Pakistan: అత్యాచారాలు పెరిగిపోతుండడంతో పాక్ లోని పంజాబ్ లో ఎమర్జెన్సీ!

Pakistans Punjab province decides to impose emergency due to rising rape cases
  • ప్రతిరోజూ 5 వరకు అత్యాచార కేసులు
  • నియంత్రణకు పలు చర్యలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ప్రకటన
  • యువతులను ఇంట్లో ఒంటరిగా ఉంచి వెళ్లొద్దంటూ సూచన
పాకిస్థాన్ లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ లో ఈ దారుణాలు పెరిగిపోతుండడం పట్ల అక్కడి సర్కారులోనూ ఆందోళన నెలకొంది. దీంతో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించాలని అక్కడి అధికార యంత్రాంగం నిర్ణయించింది. అత్యాచార కేసులను కట్టడి చేసేందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చిందని అక్కడి హోం మంత్రి అత్తా తరార్ తెలిపారు. మహిళలు, చిన్నారుల పట్ల లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం, సమాజానికి, ప్రభుత్వానికి తీవ్రమైన అంశమని చెప్పారు. 

‘‘నిత్యం నాలుగు నుంచి ఐదు అత్యాచార కేసులు వెలుగు చూస్తున్నాయి. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, బలవంతపు చర్యలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని తెలిపారు. అత్యాచారాలు, శాంతిభద్రతల పరిస్థితులను రాష్ట్ర కేబినెట్ కమిటీ సమీక్షిస్తుందని చెప్పారు. ఈ ఘటనలను నియంత్రించేందుకు టీచర్లు, అటార్నీలు, మహిళా హక్కుల సంస్థలతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. 

భద్రత గురించి తమ పిల్లలకు తెలియజెప్పాలని మంత్రి తరార్ సూచించారు. యువతులను ఇంట్లో ఒంటరిగా విడిచి వెళ్లొద్దని సూచించారు. అత్యాచార వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, స్కూళ్లలో అత్యాచార వేధింపులపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు.
Pakistan
Punjab province
rape cases
emergency

More Telugu News