Team India: మా ఇద్దరి ఆలోచనలు వేరు.. ఇప్పుడు నా పని సులువు అవుతుంది: మిథాలీపై హర్మన్​ కీలక వ్యాఖ్యలు

  • ఈ మధ్యే ఆటకు వీడ్కోలు పలికిన మిథాలీ
  • హర్మన్ కే ఇప్పుడు వన్డే కెప్టెన్సీ
  • జట్టులో రాజ్  స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరన్న హర్మన్
harmanpreet kaur says things will be easy now after mithali retirement

తన ఆటతో మహిళా క్రికెట్ కే ఖ్యాతి తెచ్చిన మిథాలీ రాజ్ పై భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేసింది. మిథాలీ, తన ఆలోచన తీరు వేర్వేరుగా ఉండేదని చెప్పింది. మిథాలీ ఆటకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇప్పుడు తన పని సులువు అవుతుందని అభిప్రాయపడింది. అదే సమయంలో జట్టులో మిథాలీ లోటు స్పష్టంగా కనిపిస్తోందని, ఆమె  స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని చెప్పింది. మొన్నటి దాకా మిథాలీ వన్డే, టెస్టు జట్టుకు సారథ్యం వహించగా.. హర్మన్ టీ20 జట్టుకు కెప్టెన్ గా ఉంది. కొన్ని విషయాల్లో వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హర్మన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

‘నేను చాలా కాలంగా టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. ఇప్పుడు వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది. జట్టుకు వేర్వేరు కెప్టెన్లు ఉన్నప్పుడు, కొన్నిసార్లు అంతా సవ్యంగా ఉండదు. ఎందుకంటే మిథాలీ, నా ఆలోచనలు వేర్వేరుగా ఉండేవి. కాబట్టి కొన్ని విషయాల్లో సమస్యలు వచ్చేవి. కానీ, ఇప్పుడు ఆ విషయాలన్నీ సులువు అవుతాయని భావిస్తున్నా. ఇప్పుడు నేను సహచరుల నుంచి ఏం ఆశిస్తున్నానో వారికి చెప్పడం సులువు అవుతుంది. వాళ్లు కూడా తమ అభిప్రాయాలను నేరుగా నాతో పంచుకోవచ్చు’ అని మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్మన్ వ్యాఖ్యానించింది. 

మిథాలీ, మరో సీనియర్ క్రికెటర్ జులన్ గోస్వామి గైర్హాజరీలో ఈ పర్యటనలో నూతన జట్టును నిర్మించడానికి తనకు ఇది గొప్ప అవకాశం అని హర్మన్ చెప్పింది. యువ క్రీడాకారులకు అవకాశాలు లభిస్తాయని తెలిపింది. జట్టులో మిథాలీ స్థానాన్ని ఎవ్వరూ  భర్తీ చేయలేరని అభిప్రాయపడింది.  

More Telugu News