Team India: అవేష్ ఖాన్ అద్భుత బౌలింగ్... నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ విజయం

  • రాజ్ కోట్ లో మ్యాచ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 రన్స్ చేసిన టీమిండియా
  • లక్ష్యఛేదనలో 87 పరుగులకే చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా
  • 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన అవేష్ ఖాన్
Team India wins fourth T20 match after Avesh Khan fierce spell

దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి సిరీస్ ఓటమి అంచున నిలిచిన టీమిండియా అద్భుతంగా రేసులోకి వచ్చింది. మొన్న మూడో టీ20 మ్యాచ్ గెలిచిన భారత కుర్రాళ్లు... నేడు నాలుగో టీ20లోనూ దుమ్మురేపేశారు. దక్షిణాఫ్రికాపై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య టీమిండియా 82 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 

యువ పేసర్ అవేష్ ఖాన్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో సఫారీలను కకావికలం చేశాడు. అవేష్ ఖాన్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, 170 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. అవేష్ ఖాన్ కు తోడు చహల్ (2 వికెట్లు), హర్షల్ పటేల్ (1 వికెట్), అక్షర్ పటేల్ (1 వికెట్) సమయోచితంగా రాణించడంతో టీమిండియా గెలుపు నల్లేరుపై నడకే అయింది. 

సఫారీ ఇన్నింగ్స్ లో వాన్ డర్ డుస్సెన్ సాధించిన 20 పరుగులే అత్యధికం. ఆరంభంలోనే కెప్టెన్ టెంబా బవుమా రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరగా, అతడు మళ్లీ బ్యాటింగ్ కు రాలేదు. డికాక్ (14), ప్రిటోరియస్ (0), క్లాసెన్ (8), మిల్లర్ (9) తుస్సుమన్నారు. ఇక సఫారీ లోయరార్డర్ కూడా పెద్దగా ప్రతిఘటన లేకుండానే చేతులెత్తేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-2తో సమవుజ్జీగా నిలిచింది. ఇక నిర్ణాయక ఐదో టీ20 మ్యాచ్ ఈ నెల 19న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

More Telugu News