England: వన్డేల్లో తన వరల్డ్ రికార్డు తానే బద్దలు కొట్టిన ఇంగ్లండ్... నెదర్లాండ్స్ పై 50 ఓవర్లలో 498 పరుగులు

  • పసికూనపై ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం
  • ఆమ్ స్టెల్వీన్ లో పరుగుల సునామీ
  • 70 బంతుల్లో 162 పరుగులు చేసిన బట్లర్
  • 7 ఫోర్లు, 14 సిక్సులు బాదిన వైనం
  • సాల్ట్, మలాన్ సెంచరీలు
  • లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్
England breaks world record after sensational batting against Nederlands

పసికూన నెదర్లాండ్స్ పై ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ వన్డేల్లో వరల్డ్ రికార్డు బద్దలయింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోరు రికార్డు మరోసారి ఇంగ్లండ్ పేరిట నమోదైంది. ఇవాళ నెదర్లాండ్స్ తో ఆమ్ స్టెల్వీన్ వేదికగా తొలివన్డేలో ఇంగ్లండ్ విశ్వరూపం ప్రదర్శించింది. 50 ఓవర్లలో 4 వికెట్లకు 498 పరుగులు చేసింది. 

గతంలో వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డు ఇంగ్లండ్ పేరిటే ఉంది. 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 50 ఓవర్లలో 481 పరుగులు చేసింది. ఇప్పుడా రికార్డును ఇంగ్లండ్ జట్టు తానే తిరగరాసింది. ఇవాళ ఆమ్ స్టెల్వీన్ లో నెదర్లాండ్స్ పై  జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, ఫిలిప్ సాల్ట్ వీరవిహారం చేశారు. 

ఓపెనర్ సాల్ట్ 93 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 122 పరుగులు చేశాడు. డేవిడ్ మలాన్ 109 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 125 పరుగులు నమోదు చేశాడు. ఇక, జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. నెదర్లాండ్స్ పసికూనల బౌలింగ్ ను ఊచకోత కోశాడు. బట్లర్ కేవలం 70 బంతుల్లోనే 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ స్కోరులో 7 ఫోర్లు, 14 సిక్సులు ఉన్నాయంటే అతడి విధ్వంసం ఏ రీతిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0) డకౌట్ అయినా ఆ ప్రభావం కనిపించలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ సైతం ప్రత్యర్థి బౌలింగ్ ను ఉతికారేశాడు. లివింగ్ స్టోన్ 22 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు, నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఇంగ్లండ్ కు బ్యాటింగ్ అప్పగించగా, ఓపెనర్ జాసన్ రాయ్ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. 

ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ విధ్వంసక శక్తిగా ఎదిగింది. నేటి మ్యాచ్ ఇంగ్లండ్ పవర్ హిట్టింగ్ కు సిసలైన నిదర్శనంలా నిలిచింది.

More Telugu News