Vijayashanti: అగ్నిపథ్ వ్యతిరేక నిరసనల వెనుక కచ్చితంగా కుట్ర ఉంది: విజయశాంతి

Vijayasanthi reacts to violence at Secunderabad railway station
  • రైళ్ల విధ్వంసం ఘటనలను ఖండించిన విజయశాంతి 
  • తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా సంయమనం కోల్పోలేదని వివరణ   
  • ఏనాడూ జాతి ఆస్తులను యువత తగలబెట్టలేదని వ్యాఖ్య
  • ఇది రెచ్చగొట్టి చేయించిన పనేనన్న విజయశాంతి  
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ నియామకాల విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు ప్రజ్వరిల్లగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. సికింద్రాబాద్ లోనూ, దేశవ్యాప్తంగానూ జరిగిన రైళ్ల విధ్వంసం ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్టుగా ఇది ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు, విద్యార్థుల పనికాదని స్పష్టం చేశారు. అగ్నిపథ్ వ్యతిరేక నిరసనల వెనుక కచ్చితంగా ప్రేరేపిత కుట్ర ఉందని ఆరోపించారు. మోదీ సర్కారును, బీజేపీని వ్యతిరేకిస్తున్న అసాంఘిక శక్తులు, రౌడీ మూకల్ని రెచ్చగొట్టి చేయిస్తున్న హింసాకాండ అని పేర్కొన్నారు. 

తెలంగాణ ఉద్యమం ఏళ్ల తరబడి తీవ్రస్థాయిలో కొనసాగిన రోజుల్లో కూడా రాష్ట్ర విద్యార్థులు, యువతీయువకులు ఎంతో సంయమనంతో వ్యవహరించారని, రైల్ రోకోలు, వంటావార్పులు, బంద్ లు, శాంతియుత నిరసనలు చేపట్టారని వివరించారు. ఆ సమయంలో దురదృష్టవశాత్తు కొందరు ఆత్మార్పణం చేసుకున్నారే తప్ప, ఏనాడూ జాతి ఆస్తులను తగలబెట్టలేదని, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేదని విజయశాంతి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఉద్యోగాలు ఇవ్వకుండా తాత్సారం చేసినా విద్యార్థులు శాంతియుతంగానే ఉన్నారని తెలిపారు. 

అసలు... దేశం కోసం ఆర్మీలో చేరాలనుకునే విద్యార్థులు, యువకులు ఈ దేశ ఆస్తులనే పాడుచేస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు. విధ్వంసకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో తమకు సంబంధంలేని వ్యక్తులు, దుకాణాలపై కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేశారని, పార్శిళ్లు తగలబెట్టారని, మహిళలు, వృద్ధులు సహా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేశారని వివరించారు. ఇది విద్యార్థులు, యువకుల పనే అంటే నమ్మాలా? అని విజయశాంతి ప్రశ్నించారు. ఇది కచ్చితంగా బీజేపీ వ్యతిరేకులు కుట్ర పన్ని, రెచ్చగొట్టి చేయించిన పనే అని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ప్రజలు అమాయకులు కారని, త్వరలోనే నిజాలు బయటికి వస్తాయని స్పష్టం చేశారు.
Vijayashanti
Violence
Railway Station
Secunderabad
BJP
Telangana

More Telugu News