Kishan Reddy: సికింద్రాబాద్ లో ఇంత జరుగుతుంటే రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారు... వారికి బాధ్యత లేదా?: కిషన్ రెడ్డి

Kishan Reddy comments on Secunderabad Railway Station violence
  • కేంద్రం అగ్నిపథ్ పై తీవ్ర ఆగ్రహజ్వాలలు
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం
  • రైలుకు నిప్పుపెట్టిన వైనం
  • పథకం ప్రకారమే చేశారన్న కిషన్ రెడ్డి
సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ విధానం దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్గిరాజేసింది. ఈ విధానంతో తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆగ్రహంతో రైళ్లకు నిప్పుపెడుతున్నారు. ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీగా గుమికూడిన ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ కు చెందిన దామోదర్ రాకేశ్ అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

సికింద్రాబాద్ స్టేషన్ అగ్నిగుండంగా మారడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ముందస్తు పథకం ప్రకారమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అగ్నిపథ్ పై యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సరికాదని స్పష్టం చేశారు. కుట్ర పన్ని, రైల్వే స్టేషన్ ను లక్ష్యంగా ఎంచుకోవడం దారుణమని పేర్కొన్నారు. 

రైలు బోగీలకు నిప్పుపెట్టారని, పలు బోగీలను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికుల బైక్ లు తగలబెట్టారని తెలిపారు. విధ్వంసానికి భయపడి ప్రయాణికులు తమ లగేజీ కూడా వదిలిపెట్టి పరుగులు తీశారని వివరించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారని, వారికి బాధ్యత లేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. 

అగ్నిపథ్ నియామక విధానంపై కేంద్రం ప్రకటన ఏకపక్ష నిర్ణయం కాదని, ప్రపంచదేశాల్లో పరిస్థితులన్నీ పరిశీలించిన మీదటే తీసుకున్న నిర్ణయం అని ఉద్ఘాటించారు. అగ్నిపథ్ పై రాష్ట్ర ప్రభుత్వాలతోనూ మాట్లాడామని వివరించారు. తాజాగా అగ్నిపథ్ లో గరిష్ఠ వయోపరిమితి 23 ఏళ్లకు పెంచామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Kishan Reddy
Secunderabad Railway Station
Violence
Agnipath
Telangana

More Telugu News