ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఆ ముగ్గురు దూరం!..కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

15-06-2022 Wed 21:09 | Sports
  • రోహిత్‌, రిష‌బ్‌, కేఎల్ రాహుల్‌ల‌కు ద‌క్క‌ని చోటు
  • వైస్ కెప్టెన్‌గా భువ‌నేశ్వ‌ర్ కుమార్‌
  • ఉమ్రాన్ మాలిక్‌కూ స్థానం క‌ల్పించిన బీసీసీఐ
Hardik Pandya is the captain for team india in the t20 series with ireland
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ బుధ‌వారం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న సిరీస్ ముగియ‌గానే... టీమిండియా ఐర్లాండ్ టూర్‌కు వెళ్ల‌నుంది. ఐర్లాండ్‌తో ఈ నెల 26, 28 తేదీల్లో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో టీమిండియా రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స‌హా, ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రిష‌బ్ పంత్‌, స్టార్ ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌ల‌కు చోటు ద‌క్క‌లేదు.

ఐర్లాండ్‌తో సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించి ఏకంగా ఆ జ‌ట్టును విజేత‌గా నిలిపిన పాండ్యాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోగా...తాజాగా ఏకంగా ఐర్లాండ్‌తో సిరీస్‌లో అత‌డికి ఏకంగా కెప్టెన్సీ ద‌క్క‌డం విశేషం. ఇక వైస్ కెప్టెన్‌గా భువ‌నేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. 

ఇక జ‌ట్టు విష‌యానికి వ‌స్తే... ఇషాన్ కిష‌న్‌, రుతురాజ్ గైక్వాడ్‌, సంజూ శాంస‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్‌, దీప‌క్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), య‌జువేంద్ర చాహ‌ల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వి బిష్ణోయ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, అవేశ్ ఖాన్‌, అర్ష‌దీప్ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌ల‌ను జ‌ట్టు స‌భ్యులుగా బీసీసీఐ ఎంపిక చేసింది.