Rains: నేడు తెలంగాణలో విస్తరించనున్న రుతుపవనాలు.. అక్కడక్కడ భారీ వర్షాలు!

Heavy rains expected today in Telangana
  • రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉందన్న వాతావరణశాఖ
  • నిన్న అత్యధికంగా దమ్మాయిగూడలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • వర్షాలు లేని ప్రాంతాల్లో ప్రతాపం చూపిన భానుడు

తెలంగాణలోకి సోమవారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నేడు, రేపు మరిన్ని ప్రాంతాలతోపాటు, మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. అందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు విస్తరించనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ నేడు భారీ వర్షాలు కురుస్తాయని, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

అలాగే, మొన్న ఉదయం నుంచి నిన్న రాత్రి వరకు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సింగపూర్ టౌన్‌షిప్ వద్ద 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో నిన్న అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News