Mamata Banerjee: రేప‌టి కీల‌క స‌మావేశానికి ముందు శ‌ర‌ద్ ప‌వార్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీ

  • రేపే విప‌క్షాల నేత‌ల‌తో దీదీ స‌మావేశం
  • రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి ఎంపికే ల‌క్ష్యంగా భేటీ
  • భేటీ కోసం డిల్లీ చేరిన దీదీ, శ‌ర‌ద్ ప‌వార్‌
  • రేసులో తాను లేనంటూ ప్ర‌క‌టించిన ప‌వార్‌
  • ఈ ప్ర‌క‌ట‌న‌పై ప‌వార్‌తో చ‌ర్చించిన దీదీ
Mamata Banerjee met NCP chief Sharad Pawar

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మడి అభ్య‌ర్థిని నిలిపే దిశ‌గా వ్యూహాలు ర‌చిస్తున్న దీదీ... బుధ‌వారం ఢిల్లీలో ప‌లు పార్టీల‌తో కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భేటీకి రావాలంటూ ఆమె ఇప్ప‌టికే వివిధ పార్టీల‌కు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేత‌ల‌కు ఆహ్వానాలు పంపారు. 

దీదీ నిర్వ‌హించే భేటీలో పాలుపంచుకునే నిమిత్తం శ‌ర‌ద్ ప‌వార్ మంగ‌ళ‌వార‌మే ఢిల్లీ చేరుకున్నారు. అంతకు ముందే ఢిల్లీ చేరుకున్న మ‌మ‌తా బెన‌ర్జీ... కాసేప‌టి క్రితం ఆయ‌న‌తో భేటీ అయ్యారు. శ‌ర‌ద్ ప‌వార్ ఇంటిలో జ‌రిగిన ఈ స‌మావేశంలో రేప‌టి స‌మావేశంలో చ‌ర్చించాల్సిన అంశాలు, భేటీకి హాజర‌య్యే పార్టీల వైఖ‌రి త‌దిత‌రాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే... విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో నిలిచే అంశంపై ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చిన శ‌ర‌ద్ ప‌వార్‌ను మ‌మ‌తా బెన‌ర్జీ స్వ‌యంగా క‌ల‌వడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

మ‌హారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం ప‌నిచేసిన ప‌వార్ కు రాజ‌కీయాల్లో మంచి ప‌ట్టు ఉన్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా వైరి వ‌ర్గంలోనూ ఆయ‌నకు మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భేటీకి ముందే రాష్ట్రప‌తి అభ్యర్థిగా తాను పోటీ చేయ‌నంటూ ప‌వార్ ప్ర‌క‌టించిన విష‌యంపైనా దీదీ ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఈ నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌ని కూడా ప‌వార్‌ను ఆమె అభ్యర్థించిన‌ట్లు స‌మాచారం.

More Telugu News