Nara Lokesh: చోటా నేత ఇంట్లోనే రూ.25 కోట్ల విగ్రహం దొరికితే... వైసీపీ పెద్ద నేతల ఇళ్లలో ఇంకెన్ని పురాతన విగ్రహాలున్నాయో!: నారా లోకేశ్

Nara Lokesh slams YSRCP leaders over valuable idol issue
  • వెంకటేశ్వరరెడ్డి అనే వైసీపీ నేత ఇంట్లో మరకత విగ్రహం
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నారా లోకేశ్
  • జగన్ రాష్ట్రంపై పడి దోచుకుంటున్నారని విమర్శలు
  • వైసీపీ నేతలు ఆలయాలను దోచుకుంటున్నారని వ్యాఖ్యలు
ప్రకాశం జిల్లాలో వెంకటేశ్వరరెడ్డి అనే వైసీపీ నేత ఇంట్లో రూ.25 కోట్ల విలువ చేసే మరకత విగ్రహం లభించడం పట్ల టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ కొల్లగొట్టిన విగ్రహాల్లో ఇదొకటని ఆయన ఆరోపించారు. వైసీపీ నేత ఇంట్లో మరకత వినాయకుడి విగ్రహం రూపంలో బయటపడిందని పేర్కొన్నారు. ఓ చోటా వైసీపీ నేత ఇంట్లోనే రూ.25 కోట్ల విలువైన విగ్రహం బయటపడిందంటే, వైసీపీ పెద్ద నేతల ఇళ్లలో ఇంకెన్ని పురాతన విగ్రహాలు ఉన్నాయోనని లోకేశ్ సందేహం వ్యక్తం చేశారు. 

వైసీపీ అధినేత రాష్ట్రంపై పడి దోచుకుంటుంటే, వైసీపీ నేతలు ఊర్ల మీద పడుతున్నారని విమర్శించారు. ఏమీ దొరక్కపోతే గుడి, గుడిలో లింగాన్నీ దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మరకత విగ్రహం ఘటనే కాకుండా, రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లోనూ వైసీపీ నేతలు నగలు, విగ్రహాలు ఎత్తుకుపోతున్నారని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. 

జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి వైసీపీ ముఠాలే హిందూ ఆలయాలపై దాడులు చేసి, టీడీపీపై ఆరోపణలు చేశారని లోకేశ్ మండిపడ్డారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన, దుర్గమ్మ వెండి సింహాల మాయం, రామతీర్థం క్షేత్రంలో రాముడి తల నరికివేత ఘటనల్లో నేటికీ నిందితులు దొరకలేదని విమర్శించారు. అయితే, వెంకటేశ్వరరెడ్డి వంటి వైసీపీ నేతల ఇళ్లలో విగ్రహాలు దొరుకుతున్నాయని వివరించారు. ఈ దొంగ ప్రభుత్వం, దోపిడీ పాలకుల హయాంలో ప్రజలకే కాదు, దేవాలయాల ఆస్తులకు, దేవతా విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అర్జంటుగా కేంద్ర బృందంతో గానీ, న్యాయ బృందం పర్యవేక్షణలో గానీ ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే దేవుళ్ల నగలు, విగ్రహాలు వైసీపీ నేతల పిల్లల మెడలో ఆభరణాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Nara Lokesh
Idol
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News