Kangana Ranaut: స్పూఫ్ వీడియోను నిజమే అనుకుని ఖతార్ ఎయిర్ వేస్ చీఫ్ ను 'ఇడియట్' అని తిట్టిన కంగనా రనౌత్

  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం
  • భారత్ ను విమర్శిస్తున్న ఖతార్ వంటి దేశాలు
  • ఖతార్ పై మండిపడిన వాసుదేవ్ అనే నెటిజన్
  • స్పూఫ్ వీడియోను రూపొందించిన మరో నెటిజన్
  • ఖతార్ ఎయిర్ వేస్ చీఫ్ కు క్లాస్ పీకిన కంగన
Kangana terms Qatar Airways chief an Idiot of a man

మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజీపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అనేక ముస్లిం దేశాలు భారత్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ ఇస్లామిక్ దేశాల్లో ఖతార్ కూడా ఉంది. అయితే ఈ క్రమంలో ఏర్పడిన గందరగోళం కారణంగా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఖతార్ ఎయిర్ వేస్ చీఫ్ ను 'ఇడియట్' అని తిట్టింది. 

ఇంతకీ ఏం జరిగిందటే... వాసుదేవ్ అనే నెటిజన్ ఖతార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. భారతీయ దేవతలను నగ్నంగా చిత్రించిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ కు ఆశ్రయం కల్పించిన దేశం ఖతార్ అని దుయ్యబట్టాడు. ఇప్పుడదే ఖతార్ నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మనకు సూక్తులు చెబుతోందని విమర్శించాడు. అందుకే, ప్రజలు ఖతార్ ఉత్పత్తులను, ఖతార్ ఎయిర్ వేస్ వంటి సంస్థను బహిష్కరించాలని వాసుదేవ్ పేర్కొన్నాడు. 

ఈ నేపథ్యంలో, మరో నెటిజన్ స్పూఫ్ వీడియో తయారుచేశాడు. ఖతార్ ఎయిర్ వేస్ చీఫ్ అక్బర్ అల్ బాకర్ గతంలో అల్ జజీరా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోకు పారడీ రూపొందించాడు. అందులో ఖతార్ ఎయిర్ వేస్ అధినేత.... వాసుదేవ్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మార్ఫింగ్ చేశారు. 

వాసుదేవ్ తమకు అతిపెద్ద వాటాదారు అని, తమ సంస్థలో అతడి వాటా రూ.624.50 అని ఆ పారడీ వీడియోలో అల్ బాకర్ చెబుతున్నట్టుగా పేర్కొన్నారు. వాసుదేవ్ దెబ్బకు ఇప్పుడు తమ విమానాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, వాటిని మళ్లీ ఎలా నడిపించాలో తెలియడంలేదని ఆయన వాపోతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. 

అయితే, ఈ వీడియోను చూసిన బాలీవుడ్ సుందరాంగి కంగనా రనౌత్ నిజమైన వీడియోనే అని భ్రమపడింది. అందులో మాట్లాడుతున్నది ఖతార్ ఎయిర్ వేస్ చీఫ్ అనుకుని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ పేద భారతీయ యువకుడ్ని బెదిరిస్తూ తమాషా చేస్తుంటే అందరూ ఆస్వాదిస్తున్నారా? అంటూ ఇతర నెటిజన్లపైనా మండిపడింది. ఓ పేదవాడిపై దౌర్జన్యపూరితంగా మాట్లాడడానికి ఈ వెధవకు సిగ్గు కూడా లేదు అంటూ ఖతార్ ఎయిర్ వేస్ చీఫ్ ను దూషించింది. 

"వాసుదేవ్ పేదవాడే కావొచ్చు... నీలాంటి సంపన్నుడికి అతడేమంత ముఖ్యమైన వ్యక్తి కాకపోవచ్చు. కానీ తన వేదనను వ్యక్తపరిచే హక్కు అతడికి ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి... ఈ ప్రపంచానికి అవతల మరో ప్రపంచం ఉంటుంది... అక్కడ అందరం సమానమే" అంటూ ఖతార్ ఎయిర్ వేస్ చీఫ్ కు క్లాస్ పీకింది. కంగన ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేసింది.

అయితే, ఆ వీడియోలో ఉన్నది నిజంగానే ఖతార్ ఎయిర్ వేస్ చీఫ్ అని కంగన తప్పులో కాలేసింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో, ఇన్ స్టాగ్రామ్ నుంచి తన పోస్టును కంగన తొలగించినట్టు తెలుస్తోంది.
.

More Telugu News