Raja Singh: జూబ్లీహిల్స్ అత్యాచార నిందితులు ఇంకా చాలా దారుణాలకు పాల్పడి ఉండొచ్చు: రాజా సింగ్ అనుమానం

  • జూబ్లీహిల్స్ లో కారులో బాలికపై అత్యాచారం
  • నిందితుల్లో ప్రముఖుల పిల్లలు!
  • నార్కో టెస్టు నిర్వహించాలన్న రాజా సింగ్
  • రాష్ట్రంలో క్రైమ్ రేటు మరింత పెరిగిందని వెల్లడి
Raja Singh comments on Jubilee Hills incident

హైదరాబాదులో ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ లో ఓ బాలికపై కారులో సామూహిక అత్యాచారం జరగడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రముఖుల పిల్లలు ఉండడంతో అధికార పక్షంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో నిందితులు ఇదే కాకుండా ఇంకెన్నో అఘాయిత్యాలకు పాల్పడి ఉంటారన్న అనుమానం కలుగుతోందని తెలిపారు. నిందితులకు నార్కో టెస్టు జరపాలని కోరారు. సీబీఐతో గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తండ్రి టీఆర్ఎస్ పార్టీలోనో, ఎంఐఎం పార్టీలోనో ఉంటే తామేం చేసినా భయపడనక్కర్లేదనే భావనకు నేతల పిల్లలు వచ్చారని రాజా సింగ్ విమర్శించారు. తాము చెప్పిందే వేదం, తమకు ఎదురులేదని కేసీఆర్, ఇతర నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ నాయకుల కారణంగా తెలంగాణ అత్యాచారాలకు నెలవుగా మారిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక క్రైమ్ రేటు తగ్గిందని సీఎం కేసీఆర్, హోంమంత్రి, కేటీఆర్ డప్పు కొట్టుకుంటున్నారని, కానీ జరుగుతున్న ఘటనలు చూస్తుంటే క్రైమ్ రేటు మరింత పెరిగినట్టు అర్థమవుతోందని తెలిపారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన మరువక ముందే మొఘల్ పురాలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని రాజా సింగ్ వెల్లడించారు.

More Telugu News