భుజాల మీద స్టార్లు పెట్టుకోవ‌డం కాదు బుర్ర‌లోకి దిగాలవి: పోలీసు అధికారిపై రేణుకా చౌద‌రి ఆగ్ర‌హం

04-06-2022 Sat 17:30
  • గ్యాంగ్ రేప్‌పై విప‌క్షాల ఉద్యమం తీవ్ర రూపం
  • హోం మంత్రిని క‌లిసేందుకు వెళ్లిన రేణుకా చౌదరి
  • అడ్డుకున్న పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేత ఫైర్‌
  • వీడియోను ట్విట్ట‌ర్‌లో పెట్టిన టీపీసీసీ
congress leader renuka chowdary fires on a senior police officer
హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలికపై జ‌రిగిన గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌పై విప‌క్షాలు ఉద్య‌మాన్ని తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్ర‌మంలో నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ ఇటు బీజేపీతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళ‌న‌ల‌కు దిగాయి. ఈ క్ర‌మంలో హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీని క‌లిసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌద‌రి య‌త్నించారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఓ పోలీసు ఉన్న‌తాధికారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రేణుకా చౌద‌రి.. పోలీసుల తీరుపై నిప్పులు చెరుగుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భుజాల మీద స్టార్లు పెట్టుకోవ‌డం కాదు బుర్ర‌లోకి దిగాల‌వి అంటూ ఆమె పోలీసు అధికారిపై విరుచుకుప‌డ్డారు. అస‌లు ఏం అనుకుంటున్నావంటూ కూడా ఆమె పోలీసు అధికారిని నిల‌దీశారు. పోలీసు అధికారిపై ఈ స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రేణుకా చౌద‌రికి చెందిన వీడియోను టీపీసీసీనే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.