Sidhu Moosewala: సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో 420 మందికి పైగా భద్రత పునరుద్ధరించనున్న పంజాబ్ ప్రభుత్వం

  • ఇటీవలే ప్రముఖులకు భద్రత తొలగింపు
  • పంజాబ్ లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య
  • ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
  • కోర్టులో పిటిషన్ వేసిన మాజీ మంత్రి
Punjab govt restored curtailed security cover to VVIPs

ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్య సంచలనం సృష్టించింది. పంజాబ్ ప్రభుత్వం 424 మందికి భద్రత తొలగించగా, వారిలో సిద్ధూ మూసేవాలా కూడా ఒకరు. భద్రత తొలగించిన మరుసటి రోజే సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. 

ఈ క్రమంలో, ఇటీవల భద్రత తొలగించిన 420 మందికి పైగా వ్యక్తులకు పంజాబ్ ప్రభుత్వం భద్రత పునరుద్ధరించనుంది. జూన్ 7 నుంచి భద్రత పునరుద్ధరణ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 

424 మందికి భద్రత తొలగించడంపై మాజీ మంత్రి ఓపీ సోనీ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా, తొలగించిన భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 

కాగా, జూన్ 6న ఆపరేషన్ బ్లూస్టార్ (1984 నాటి సైనిక చర్య) నిర్వహించిన రోజు కావడంతో భద్రతా సిబ్బంది అవసరమైనందునే, వీవీఐపీల భద్రతను కుదించామని వివరించింది. జూన్ 7 నుంచి పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.

More Telugu News