Vijayasanthi: కేజ్రీవాల్ అపాయింట్ మెంట్ కోసం సీఎం కేసీఆర్ వేచిచూడడం తెలంగాణకే సిగ్గుచేటు: విజయశాంతి

  • కేసీఆర్ కు పాలన చేతకావడంలేదన్న విజయశాంతి
  • అందుకే ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని కామెంట్  
  • కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోవడంలేదని వ్యాఖ్యలు
  • 2018లో బొక్కబోర్లాపడ్డారని వ్యంగ్యం
Vijayasanthi criticizes CM KCR over his national tour

తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పై తాజాగా విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరూ పట్టించుకోకపోయినా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద కేసీఆర్ పడిగాపులు కాస్తున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద అపాయింట్ మెంట్ కోసం సీఎం కేసీఆర్ వేచిచూడడం తెలంగాణకే సిగ్గుచేటు అని పేర్కొన్నారు. 

తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పట్టించుకోకుండా, పక్క రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు చెక్కులు పంచడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. 2018లో కేంద్రంలో చక్రం తిప్పుతానని వెళ్లిన సీఎం కేసీఆర్ బొక్కబోర్లాపడ్డారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వలేని అప్పులకుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్ దేనని విజయశాంతి విమర్శించారు. చట్టాలను మార్చి అప్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ చర్యలను కాగ్ తప్పుబడుతోందని వెల్లడించారు. ఇష్టం వచ్చినట్టుగా అన్నింటిపైనా చార్జీలు పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి వారిపై అధిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. 

ఎన్నో త్యాగాలు, ఆకాంక్షల నడుమ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు గడిచిందని... ఆరంభం నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలు, విషాదాలే తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రజలను అన్ని రకాలుగా కష్టనష్టాల పాలుచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ధి చెప్పడం ఖాయమని విజయశాంతి తెలిపారు.

More Telugu News