Southwest Monsoon: విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు... మేఘాలయలో కుంభవృష్టికి అవకాశం

Southwest monsoon advances further in some more parts of India
  • ఈ నెల 29న కేరళను తాకిన రుతుపవనాలు
  • ముందుగానే వచ్చిన నైరుతి సీజన్
  • అనుకూలంగా ఉన్న వాతావరణ పరిస్థితులు
  • వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
ఈసారి ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలోనూ, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు బెంగాల్, సబ్ హిమాలయన్ ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించింది. 

అదే సమయంలో వాయవ్య బంగాళాఖాతం నుంచి ఉత్తరప్రదేశ్ ఈశాన్య ప్రాంతం, నాగాలండ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

ఈ నెల 2 నుంచి 4 వరకు అసోం, మేఘాలయలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. సిక్కిం, బెంగాల్, సబ్ హిమాలయన్ ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి 6 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక, నేడు, రేపు మేఘాలయలో కొన్నిచోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

కాగా, రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే మేఘాలయ, సిక్కిం, సబ్ హిమాలయన్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసినట్టు ఐఎండీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.
Southwest Monsoon
Bay Of Bengal
Meghalaya
Bengal
Sikkim
Sub Himalayan
IMD

More Telugu News