విదేశీ ప్రయాణికులకు ‘మంకీ పాక్స్’పై కేంద్రం కీలక సూచనలు

  • విదేశాల్లో బుష్ మీట్ తినకూడదు
  • అడవి జంతువులు, కోతులు, ఎలుకలు, ఉడతలకు దూరంగా ఉండాలి
  • అనారోగ్యంతో ఉన్న వారికీ దూరం పాటించాలని సూచన
  • విమానాశ్రయాల్లో విధిగా స్క్రీన్ చేయాలి
  • కేంద్రం మార్గదర్శకాల జారీ
Health ministry issues advisory for international passengers

ఆఫ్రికా నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న మంకీ పాక్స్ వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. ఇప్పటికే ఈ వైరస్ 23 దేశాలకు వ్యాపించగా, సుమారు 300 కు పైగా కేసులు నమోదయ్యాయి. 

ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది. బుష్ మీట్ (అడవి జంతువులు) తినడం కానీ వండడం కానీ చేయద్దని కోరింది. అలాగే, ఆఫ్రికా జంతు పదార్థాలతో తయారైన క్రీములు, లోషన్లు, పౌడర్లను వాడొద్దని సూచించింది. దీనికితోడు అనారోగ్యంతో ఉన్న వారికి సన్నిహితంగా మెలగవద్దని కోరింది. వారిని తాకడం కూడా చేయవద్దని హెచ్చరించింది.

ఈ మేరకు ‘మంకీ పాక్స్’పై ఎలా నడుచుకోవాలో తెలియజేసే మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ పంపింది. చనిపోయిన లేదా జీవించి ఉన్న అడవి జంతువులు, ఎలుకలు, ఉడతలు, కోతులు, ఏప్స్ కు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే, అనారోగ్యంతో ఉన్నవారు వినియోగించిన దుప్పట్లు, ఇతర మెటీరియల్ ను కూడా ఉపయోగించొద్దని సూచించింది. 

మంకీ పాక్స్ వెలుగు చూసిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను స్క్రీన్ చేయాలని.. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు అంతకుముందు 21 రోజుల్లో ఎక్కడెక్కడ ప్రయాణించారన్న వివరాలను కూడా ఆరా తీయాలని రాష్ట్ర యంత్రాంగాలకు సూచించింది. అవసరమైతే అనుమానితులను వేరుగా ఉంచి చికిత్స ఇచ్చేందుకు విమానాశ్రయాల సమీపంలోనే వసతులు కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఏదైనా అనుమానిత కేసును గుర్తిస్తే వెంటనే ఆ సమాచారాన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు తెలియజేయాలని పేర్కొంది. 

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎవరైనా మంకీ పాక్స్ వైరస్ కు సంబంధించిన లక్షణాలు (జ్వరం, చర్మంపై దద్దుర్లు) కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో రిపోర్ట్ చేయాలని సూచించింది.

More Telugu News