Prashant Kishor: ఇక కాంగ్రెస్ పార్టీతో కలవను గాక కలవను... చేతులు జోడించి మరీ చెప్పిన ప్రశాంత్ కిశోర్

  • ఇటీవల కాంగ్రెస్ లో చేరేందుకు పీకే ప్రయత్నం
  • చివరి నిమిషంలో భేదాభిప్రాయాలు
  • వెనక్కి తగ్గిన ప్రశాంత్ కిశోర్
  • తాజాగా బీహార్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు
Prashant Kishore says he never go with Congress party

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా చేరినట్టేనని అందరూ భావించినా, చివరి నిమిషంలో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం బీహార్ లో పర్యటిస్తున్న ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీపై తాజా వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ పార్టీతో ఇక కలిసేదే లేదు... కాంగ్రెస్ పార్టీకి ఓ నమస్కారం" అంటూ చేతులు జోడించి మరీ చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ బాసులు తాము పతనం కావడమే కాకుండా, తమతో కలిసిన వారిని కూడా పతనం దిశగా తీసుకెళతారని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా, తాను కూడా మునిగిపోతానని అన్నారు. 

"2015లో మేం బీహార్ లో గెలిచాం. 2017లో పంజాబ్ లో గెలిచాం. 2019లో ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గెలిచారు. తమిళనాడు, బెంగాల్ లోనూ గెలిచాం. 11 ఏళ్లలో ఒక్కచోట మాత్రమే ఓడిపోయాం. 2017 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి చెందాం. అందుకే ఇంకెప్పుడూ కాంగ్రెస్ పార్టీతో కలవకూడదని నిర్ణయించుకున్నాను" అని ప్రశాంత్ కిశోర్ వివరించారు. 

ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

More Telugu News