Samsung: ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో తిరుగేలేని శామ్ సంగ్

Samsung dominates the premium ultra premium smartphone segment
  • మార్చి నెలలో 81 శాతం వాటా
  • జనవరి-మార్చి కాలంలో 63 శాతం వాటా
  • మొత్తం స్మార్ట్ ఫోన్లలో 27 శాతం వాటా శామ్ సంగ్ సొంతం
  • వెల్లడించిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్
భారత మార్కెట్లో ప్రీమియం, అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగాల్లో శామ్ సంగ్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలకు ప్రీమియం విభాగంలో 81 శాతం వాటా కలిగి ఉంది. రూ.లక్ష, అంతకుమించిన ఖరీదైన ఫోన్లు ప్రీమియం విభాగం కిందకు వస్తాయి. ఇక 2022 జనవరి-మార్చి త్రైమాసికం మొత్తం మీద ప్రీమియం ఫోన్ల విభాగంలో శామ్ సంగ్ వాటా 63 శాతంగా ఉంది. 2021 మొదటి మూడు నెలల్లో ఇది 55 శాతంగానే ఉంది. అక్కడి నుంచి ఎనిమిది శాతం పెరిగింది.

విక్రయించిన ఫోన్ల సంఖ్యా పరంగా చూస్తే, శామ్ సంగ్ వాటా 74 శాతంగా ఉంది. భారీ సక్సెస్ సాధించిన గెలాక్సీ ఎస్22 అల్ట్రా అధిక విక్రయాలకు కారణమైనట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఇక మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో శామ్ సంగ్ వాటా 2022 మార్చి నెలలో విలువ పరంగా (విక్రయించిన ఫోన్ల విలువ) 27 శాతం, సంఖ్యా పరంగా (విక్రయించిన మొత్తం ఫోన్లు) 22 శాతం చొప్పున ఉంది. 

ఇక మెట్రోల నుంచి చిన్న పట్టణాల వరకు ప్రీమియం ఫోన్లను పంపిణీ చేయడం, రుణంపై కొనుగోలు చేసే సదుపాయం కల్పించడం అధిక విక్రయాలకు సాయపడినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. భారత వినియోగదారుల మనసులు గెలుచుకునేందుకు 3ఈ విధానంపై దృష్టి సారించినట్టు శామ్ సంగ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ తెలిపారు.
Samsung
premium
smart phones
market share

More Telugu News