గుజరాత్ 'ఐపీఎల్ టైటిల్' గెలుచుకోవడంపై.. క్రికెట్ దిగ్గజాలు ఇలా స్పందించారు..!

30-05-2022 Mon 12:27
  • శుభాకాంక్షలు చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జైషా
  • గుజరాత్ టైటాన్స్ ను నిలకడైన జట్టుగా పేర్కొన్న సచిన్
  • రాజస్థాన్ జట్టు ఆట కూడా గర్వపడేలా ఉందన్న సెహ్వాగ్
Gujarat Titans Win IPL Heres How The World Reacted
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ చక్కని ప్రతిభతో ఐపీఎల్ 2022 విజేతగా నిలవగా.. దీనిపై ప్రముఖ క్రికెటర్లు స్పందించారు. సొంత ప్రజల మధ్య మొదటి ఏడాదే గుజరాత్ టైటాన్స్ కప్పును సాధించడం పట్ల.. ఆ జట్టుకు, కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు బీసీసీఐ కార్యదర్శి జైషా శుభాకాంక్షలు తెలియజేశారు. 

క్రికెట్ లెజెండ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ‘‘నిస్సందేహంగా ఈ టోర్నమెంట్ లో అత్యంత నిలకడైన జట్టు గుజరాత్ టైటాన్స్. చక్కగా ఆడారు’’ అంటూ గుజరాత్ జట్టుకు అభినందనలు తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ ను ఈ సీజన్ లో అత్యుత్తమ జట్టుగా యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. హార్థిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్ కు అద్భుతమైన టోర్నమెంట్ అని చెప్పాడు.  

‘నీవు కచ్చితంగా ఛాంపియన్. గొప్పగా ఆడిన గుజరాత్ టైటాన్స్’ అంటూ దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు. రాజస్థాన్ జట్టు ఆట కూడా గర్వపడేలా ఉందని పేర్కొన్నాడు. వసీమ్ జాఫర్ సైతం శుభాకాంక్షలు తెలిపాడు. 

‘‘గుజరాత్ జట్టుకు ఈ అరంగేట్రం కలకాలం గుర్తుండిపోతుంది. నాయకుడిగా, ఆటగాడిగా హార్థిక్ పాండ్యా కచ్చితంగా తెలివైనవాడు. కొత్త విజేతను చూడడం గొప్పగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ కు సైతం ఈ సీజన్ గర్వకారణం’’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 

‘‘ఐపీఎల్ ఆరంభంలో పేపర్ పై చూస్తే బలమైన జట్టుగా అనిపించలేదు. కానీ, గుజరాత్ టైటాన్స్ తమ ఆటతీరుతో, టైటిల్ గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మన జీవితాల్లో గుజరాత్ టైటాన్స్ మంచి పాఠాన్ని నేర్పించింది’’ అంటూ అమిత్ మిశ్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.